Begin typing your search above and press return to search.

ద‌మ్ము అంటే జ‌గ‌న్ దే బాసూ!

By:  Tupaki Desk   |   29 July 2018 4:44 AM GMT
ద‌మ్ము అంటే జ‌గ‌న్ దే బాసూ!
X
రాజ‌కీయ నాయ‌కుడు అన్నంత‌నే.. అవ‌స‌రానికి అబ‌ద్ధాలు చెప్ప‌టం.. అధికారం కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇవ్వ‌టం.. ప్ర‌జ‌ల్లో లేనిపోని ఆశ‌లు క‌ల్పించ‌టం.. వాటిని తీర్చ‌కుండా ఉండేందుకు నాట‌కాలు ఆడ‌టం..ఈ క్ర‌మంలో లేని పోని ర‌చ్చ జ‌ర‌గ‌టం లాంటివి రాజ‌కీయాల్లో మామూలే. అమ‌లు చేయ‌లేని హామీల్ని సైతం..మ‌సి పూసి మారేడు కాయ మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టంలో ఇప్ప‌టి నేత‌ల‌కు మించినోళ్లు క‌నిపించ‌రు.

కానీ.. ఇందుకు భిన్నంగా నోటి నుంచి వ‌చ్చే మాట‌లో.. ఇచ్చే హామీలో ఏ మాత్రం త‌ప్పు దొర్లకూడ‌ద‌న్న క‌మిట్ మెంట్ తో వ్య‌వ‌హ‌రించే అధినేత‌లు ఇప్ప‌టి రాజ‌కీయాల్లో క‌నిపిస్తారా? అంటే.. నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి విష‌యంలో తాను ఉన్నాన‌న్న విష‌యాన్ని మ‌రోసారి ఫ్రూవ్ చేశారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

ఓట్ల కోసం నోటికి వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇవ్వ‌టం స‌రికాద‌న్న విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే కాదు.. మాట‌ల‌తో ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి ప‌బ్బం గ‌డుపుకోవ‌టం త‌న‌కు కుద‌ర‌ని ప‌ని అన్న విష‌యాన్ని మ‌రోసారి తేల్చి చెప్పారు జ‌గ‌న్‌. అధికారం కోసం ఏమైనా స‌రే.. య‌స్ అనేయ‌టం.. ఆ త‌ర్వాత కిందా మీదా ప‌డ‌టం కంటే.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్ప‌టం రిస్క్ అయిన‌ప్ప‌టికీ.. దాన్ని ఫేస్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న జ‌గ‌న్ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కాపులకు రిజ‌ర్వేష‌న్ల‌పై చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు.. దాని అమ‌లు విష‌యంలో ఎదుర్కొంటున్న ఇబ్బంది తెలిసిందే. ఎవ‌రు ఎన్ని హామీలు ఇచ్చినా.. సుప్రీంకోర్టు తీర్పుతోపాటు.. కేంద్రం ఆమోదించే విష‌యంలో ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం ఖాయం. కానీ.. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే బాబు తీరుకు భిన్నంగా కాపు రిజ‌ర్వేష‌న్ల పై పూర్తి క్లారిటీ ఇచ్చారు జ‌గ‌న్‌.

కాపు రిజ‌ర్వేషన్ల‌పై జ‌గ‌న్ మాట్లాడాలంటూ.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో జ‌రుగుతున్న పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కొంద‌రు ప్ల‌కార్డులు ప‌ట్టుకున్నారు. దీనిపై స్పందించిన జ‌గ‌న్‌.. "చంద్ర‌బాబు ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని అడిగినందుకు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను నిర్బంధించారు. వారింట్లో ఆడ‌వాళ్ల‌ని కూడా చూడ‌కుండా దౌర్జ‌న్యం చేశారు. నేను ఏదైనా మాట ఇస్తే మాట మీదే నిల‌బ‌డ‌తా. చేయ‌గ‌లిగింది మాత్ర‌మే చెబుతా. నాకు చేయ‌లేనిది చెప్పే అల‌వాటు లేదు. కాపు సోద‌రుల‌కు చెబుతున్నా. కొన్ని అంశాలు రాష్ట్ర ప‌ర‌భుత్వం ప‌రిధిలో ఉంటాయి. మ‌రికొన్ని.. రాష్ట్రల ప‌రిధిలో ఉండ‌వు. అలాంటిది ఈ రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య‌. రిజర్వేష‌న్లు 50 శాతం దాటితే సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్ ఉన్న ప‌రిస్థితుల్లో.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో లేని అంశం కావ‌టంతో దీనిపై నేను మాట ఇవ్వ‌లేను" అంటూ స్ప‌ష్టం చేశారు.

ఓట్ల కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం త‌న‌కు రాద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ త‌న తాజా వివ‌ర‌ణ‌తో మ‌రోసారి తేల్చేశార‌ని చెప్పాలి. మోస‌పూరిత హామీల‌కు తాను దూర‌మ‌ని.. మాయ చేసి నాలుగు ఓట్లు సంపాదించుకునే క‌న్నా.. వాటికి దూరంగా ఉండ‌టానికే తాను ప్రాధాన్య‌త ఇస్తాన‌న్న మాట‌ను త‌న వైఖ‌రితో జ‌గ‌న్ మ‌రోసారి తేల్చి చెప్పార‌ని చెప్పాలి. ఇలాంటి తీరు ఇప్ప‌టి రాజ‌కీయ అధినేత‌ల్లో క‌నిపించ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.