Begin typing your search above and press return to search.
కాపు కార్పొరేషన్ కు 10వేల కోట్లు:జగన్
By: Tupaki Desk | 31 July 2018 6:08 PM GMTజగ్గంపేటలో జరిగిన సభలో కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు - ఎల్లో మీడియా విషం కక్కిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన చంద్రబాబు.....కాపులకు జగన్ వ్యతిరేకం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నది సుస్పష్టం. జగన్ పై బురద జల్లేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డ చంద్రబాబు....ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్లపై - కాపు కార్పొరేషన్ పై జగన్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన చంద్రబాబు పై జగన్ నిప్పులు చెరిగారు. కాపు రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని - కాపు రిజర్వేషన్లకు తాను సంపూర్ణ మద్దతిస్తున్నానని జగన్ ప్రకటించారు. బాబులా గాలి కబుర్లు చెప్పని జగన్ మోసగాడా....చెప్పినవి చేయకుండా....ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు మోసగాడా అని జగన్ ప్రశ్నించారు. పిఠాపురం సభలో ఘాటుగా స్పందించారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కు చంద్రబాబు 5 సంవత్సరాల్లో 5వేల కోట్లు ఇస్తానని మోసం చేశారని...కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కు రూ. 10వేల కోట్లు ఇస్తామని జగన్ అనే తాను హామీ ఇస్తున్నానని ప్రకటించారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటా వంటా లేదని జగన్ నొక్కి వక్కాణించారు. పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్ తనపై వస్తోన్న వక్రీకరణ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు తాము ఎప్పటినుంచో మద్దతునిస్తున్నామని జగన్ అన్నారు. కాపులకు చంద్రబాబు అన్యాయం చేశారని, కాపులకు మొదటినుంచి అండగా నిలుస్తోంది వైసీపీయేననీ జగన్ అన్నారు. దీక్ష చేపట్టిన కాపులను వేధించిన చంద్రబాబు మోసగాడా? లేక కాపులకు అండగా ఉన్న జగన్ మోసగాడా? అని ఆయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై పార్లమెంటులో గొడవ పడాలని చంద్రబాబు తన ఎంపీలకు చెప్పినట్లు కొత్త డ్రామాకు తెరతీశారని జగన్ మండిపడ్డారు. 5 ఏళ్లలో కాపులకు రూ. 5వేల కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు....నాలుగేళ్లలో రూ. 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తానని .....జగన్ అనే నేను హామీ ఇస్తున్నానని చెప్పారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటా వంటా లేదని, ఇచ్చిన హామీలు అమలు చేసి తీరతానని జగన్ అన్నారు. రాష్ట్ర పరిధిలో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిసినా.. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ మ్యానిఫెస్టోలో చంద్రబాబు ఎందుకు పెట్టారని జగన్ ప్రశ్నించారు. అయితే, కాపులకు రిజర్వేషన్ల విషయంలో నిపుణులు సలహాలు ఇస్తే వైసీపీ స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.