Begin typing your search above and press return to search.

మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం.. జ‌గ‌నంటే అదే

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:30 AM GMT
మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం.. జ‌గ‌నంటే అదే
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్షాల మాటల దాడి కొన‌సాగుతూనే ఉంది. ఆయ‌న‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితులు క‌లిసి రావ‌డం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భార్య గురించి వైసీపీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు హోరెత్తాయి. ఇప్పుడు మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డంతో ఆ విమ‌ర్శ‌ల దాడి మ‌రింత పెరిగింది. శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని కూడా వెన‌క్కి తీసుకోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నాయి.

వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట ప‌డ‌కుండా చేసేందుకు.. వాళ్ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికే సీఎం ఈ జ‌గ‌న్నాట‌కానికి తెర‌తీశార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఇక జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలోకి నెడుతున్నార‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఇప్పుడిక ప్ర‌ధాన పార్టీ అయిన బీజేపీ కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై మాట‌ల తూటాల‌ను వ‌దిలింది. జ‌గ‌న్ మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం త‌ప్ప మరేమీ చేయ‌ట్లేద‌ని బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్ ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించారు.

"పెన్ష‌న్‌పై మాట త‌ప్పాడు. అమ‌రావ‌తిపై మ‌డ‌మ తిప్పాడు. మ‌ధ్య నిషేధంపై మాట త‌ప్పాడు. మండ‌లిపై మ‌డ‌మ తిప్పాడు. సీపీఎస్‌పై మాట త‌ప్పాడు. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌పై మ‌డ‌మ తిప్పాడు. ఇసుక పాల‌సీపై మాట త‌ప్పాడు. రివ‌ర్స్ టెండ‌రింగ్‌పై మ‌డ‌మ తిప్పాడు, ఒక్క మాట నిల‌బెట్టుకోలేదు. ఒక్క నిర్ణ‌యం మీద నిల‌క‌డ లేదు" అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి స‌త్య‌కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వ‌రుస‌గా త‌మ ప్రభుత్వ నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ వెన‌క్కి తీసుకోవ‌డంలో జ‌గ‌న్ వ్యూహం ఏమై ఉంటుంద‌ని విశ్లేష‌కులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించేందుకు జ‌గ‌న్ ఈ దిశ‌గా సాగుతున్నాడ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.