Begin typing your search above and press return to search.

సెప్టెంబ‌రులో సంక్షేమ గాలులు.. రాష్ట్రంలో పండ‌గే పండ‌గ‌!

By:  Tupaki Desk   |   27 Aug 2019 3:36 PM GMT
సెప్టెంబ‌రులో సంక్షేమ గాలులు.. రాష్ట్రంలో పండ‌గే పండ‌గ‌!
X
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ముహూర్తం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. వ‌చ్చే నెల సెప్టెంబ‌రు నుంచి కీల‌క‌మైన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి ప‌నికీ ఓ డేట్ పెట్టుకుని ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ముందుకు సాగుతున్నారు. సాధార‌ణంగా సెప్టెంబ‌రు అన‌గానే పండ‌గ‌ల సీజ‌న్ ప్రారంభ‌మ‌వు తుంది. వినాయ‌క చ‌వితితో పాటు - ద‌స‌రా.. ముస్లింల పండుగ‌లు కూడా ఈ నెల‌లోనే వ‌స్తుంటాయి. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వీటికితోడు సంక్షేమ పండుగ‌ల‌ను కూడా జ‌గ‌న్ తీసుకువ‌స్తున్నారు. త‌న మేనిఫెస్టోలో పేర్కొన్న కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను ఈ నెల నుంచి అమ‌లు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జ‌గ‌నే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే ప‌లు కీల‌క ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం ప్రారంభించిన జ‌గ‌న్‌.. మ‌రిన్ని కీల‌క ప్రాజెక్టుల‌కు సెప్టెంబ‌రు మాసాన్ని గ‌డువుగా పెట్టుకున్నారు. సొంత ఆటో - సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌ కం బర్డ్‌ బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే గాకుండా - వాలంటీర్లు ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై కూడా దృష్టిపెట్టాలని ఆదేశించారు.

అదేస‌మ‌యంలో మ‌రో కీల‌క‌మైన ప‌థ‌కానికి కూడా జ‌గ‌న్ సెప్టెంబ‌రు నే ఎంచుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేసిన ఇసుక మాఫియాకు చెక్ పెట్టిన ఆయ‌న ఇక నుంచి ఇసుక‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌కు పేద‌ల‌కు - మ‌ధ్య త‌ర‌గ‌తికి అందించ‌డం ద్వారా వారి సొంత ఇంటి క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఊపిరులూదాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబ‌రు 5 వ తేదీనాడు తానే స్వ‌యంగా నూతన ఇసుక పాల‌సీని ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అదేస‌మ‌యంలో సెప్టెంబ‌రు 30తో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న మ‌ద్యం విధానం ర‌ద్దు కానుంది.

ఆ వెంట‌నే కొత్త విధానం అమ‌లులోకి వ‌స్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు బెల్ట్ షాపుల‌పై యుద్ధం చేసిన జ‌గ‌న్‌.. కొత్త మ‌ద్యం విధానంలో లిక్క‌ర్ ల‌భ్య‌త‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించాల‌ని కంక‌ణం క‌ట్ట‌కున్నారు. దీని ప్ర‌కారం సెప్టెంబ‌రు 30 త‌ర్వాత లిక్క‌రు షాపుల సంఖ్యను 22% త‌గ్గించ‌డంతో పాటు - ప్రైవేటు వ్యాపారాన్ని బంద్ చేయ‌నున్నారు. ఇక‌, స‌మ‌యాన్ని కూడా త‌గ్గించారు. ఉద‌యం 10 నుంచి రాత్రి 9 వ‌ర‌కు మాత్ర‌మే వైన్ షాపులు ఉండేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప‌ర్మిట్ రూమ్‌ లు ఎత్తేశారు. ఇలా సెప్టెంబ‌రులో మూడు కీల‌క ప్రాజెక్టుల‌కు జ‌గ‌న్ ఊప‌రిలూద‌డం ద్వారా ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో క‌న్నీరు తుడిచి ఆనందం నింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో సంతోష వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.