Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్లాన్ అదిరిపోయేలా ఉందే...

By:  Tupaki Desk   |   23 Jun 2016 2:50 PM GMT
జ‌గ‌న్ ప్లాన్ అదిరిపోయేలా ఉందే...
X
జంప్ జిలానీల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఈ ట్రెండ్‌ కు చెక్ పెట్టేందుకు కొత్త‌ పార్ములాను తెర‌మీద‌కు తెచ్చారు. వలసలతో కుదేలైన వైసీపీ నాయ‌కుల‌ను భ‌రోసా నింపేందుకు ఆయ‌న ప‌ద‌వుల పంప‌కం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా పలు కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను బుజ్జగించడంతో పాటు.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ‌య్యారు. ఇందులో భాగంగా కీల‌క నేత‌ల‌కు ఇప్ప‌టికే పంప‌కం చేసేశారు.

వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు - నేతలు పార్టీని వీడటంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిన సంగ‌తి తెలిసిందే. ఇకపై వలసలు కొనసాగకుండా జ‌గ‌న్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ నేప‌థ్యంలో 2014 ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డవారు - ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారు.. పార్టీలో ఇప్పటివరకు ఎలాంటి పదవులు పొందని వారిని గుర్తించే పనిలో పడ్డారు. వైసీపీ సీనియర్‌ నేత - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవల వారి మధ్య గ్యాప్‌ పెరడంతో బాలినేని పార్టీ వీడుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీ అప్రమత్తమై బాలినేనికి ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాకతో అప్ప‌టికే పార్టీలో ఉన్న కోలగట్ల అసంతృప్తిగా ఉన్నారు. కోలగట్ల కూడా పార్టీ మారతారని ప్రచారం ఊపందుకోవడంతో.. ఆయనకూ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. దాంతో పాటు రాష్ట్ర యువజన - విద్యార్థి విభాగ కార్యక్రమాల పర్యవేక్షకుడిగానూ బాధ్యతలు అప్పగించారు. అలాగే గతంలో వైసీపీ యూత్ అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధను విజయవాడ సిటీ అధ్యక్షుడిగా నియమించారు. రాధకు యూత్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో రాధ ఎక్కడ పార్టీకి దూరమవుతారోనన్న ఉద్దేశంతో.. ఆయనకు విజయవాడ నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడటంతో జిల్లా అధ్యక్ష పదవి జక్కంపూడి విజయలక్ష్మికి ఇస్తారని అందరూ భావించారు. కాని ఆ పదవిని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కూరసాల కన్నబాబుకు ఇవ్వడంతో జక్కంపూడి వర్గం అసంతృప్తికి గురైంది. దాంతో జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడు రాజాకు రాష్ట్ర యూత్‌ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ అసంతృప్త నేతలున్నారో.. వారందరినీ గుర్తించి పార్టీ పదవులతో బుజ్జగించే పని మొద‌లుపెట్టారు. తద్వారా అధికార పార్టీ ప‌ద‌వుల ట్రెండ్‌ కు భిన్నంగా ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా అదే ఫార్ములాను పాలో అవుతోంద‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.