Begin typing your search above and press return to search.

టైమింగ్‌ ను న‌మ్ముకుంటున్న జగ‌న్

By:  Tupaki Desk   |   3 Oct 2016 7:21 AM GMT
టైమింగ్‌ ను న‌మ్ముకుంటున్న జగ‌న్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం విప్పుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న అడుగులు అత్యంత వ్యూహాత్మ‌కంగా వేస్తున్నార‌ని చెప్తున్నారు. హోదాకు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే క్ర‌మంలో ఇటీవ‌ల ఎన్నారైల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్... త‌మ పోరులో వామపక్ష పార్టీల మద్దతు తీసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌కు కొన‌సాగింపుగా అన్న‌ట్లుగా తాజాగా జ‌గ‌న్ ముంద‌డుగు వేశారు.

బీమవరంలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ సందర్శించేందుకు వెళ్లిన సీపీఎం రాష్టక్రార్యదర్శి పి.మధును అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో వై.ఎస్‌.జగన్ ఫోన్ చేసి మాటామంతి కలిపారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం.

స్వయంగా వైఎస్ జగన్ తోటి ప్ర‌తిప‌క్ష‌మైన సీపీఎం రాష్ట సార‌థికి ఫోన్‌ చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో దోస్తీకి ముందస్తు చొరవే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని ఆరుదైన సమయాల్లో తప్పా అన్నిఎన్నికల్లో అధికారపక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలు వామపక్ష పార్టీలతో కలసిన తరువాతే సాధ్యమైంది. గతంలోని అనేక ఉద్దంతాలు ఇందుకు ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ లో గత ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వామపక్షాలు సైతం తిరిగి పుంజుకొనేందుకు ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసివెలడం తమకు కలిసొస్తుందన్న యోచనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్‌ లో ఉన్న కార్పోరేషన్‌ - మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికంగా వామపక్ష పార్టీలతో అవగాహన చేసుకొని అధికార టిడిపిని ఎదుర్కోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం తన పార్టీ నేతలకు ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును ఫోన్లో జగన్‌ పలకరించడం - వారి ఉద్యమానికి మద్దతు పలకడం వంటి చర్యలు భవిష్యత్‌ లో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడే మార్గాలు సుగుమం చేసుకొంటోందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తనకు ప్రజల్లో ఆదరణ ఉందన్న విషయంపై ధీమాను ప్రదర్శిస్తునే ప్రజావ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నో ఉద్దంతాలలో అధికార పక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలకు వామపక్ష పార్టీలు అండగా నిలబడటంతోనే సాధ్యమైందని రాజకీయవర్గాల విశ్లేషణ. గతంలో 2004లో సుధీర్ఘ పాదయాత్ర ద్వారా దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నాడు కాంగ్రెస్‌ పార్టీకి ఆశేష ప్రజాద‌రణ కూడగట్టినా వామపక్షాలు సైతం తోడవ్వడంతోనే నాడు అధికారంలో నున్న టీడీపీని ఘోరంగా ఓడించగలిగాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇప్పుడు కూడా ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకప్పటి పరిస్థితి నుంచి అధికార టీడీపీ కొంత బలంగా తయారైందన్న భావన కూడా రాజకీయ వర్గాల్లోవుంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలతో అంతే బలోపేతమవుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముందున్న సవాల్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకటి అని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ. ఇందుకోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకొంటోందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. రాష్ట్రంలో వామపక్షాలు స్వతహాగా అధికారంలోకి గానీ బలమైన ప్రతిపక్షంగా గానీ ఎదిగే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేకపోయినా అధికార పక్షానికి ప్రజావ్యతిరేకతను బలంగా కూడగట్టడంలో మాత్రం ఆ పార్టీలు సఫలీకృతమవుతాయన్న భావన రాజకీయవర్గాల్లో వుంది. ఈ విషయాన్ని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ధృవీకరిస్తాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో ఏపీలో జరిగే పెండింగ్‌ మున్సిపల్‌ - కార్పోరేషన్‌ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహనతో వెళ్లండి అని పార్టీ నేతలకు వై.ఎస్‌.జగన్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలతో పొత్తు ఉండొచ్చని అంతర్గతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/