Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ్యూహానికి!... బాబు బోల్తా ప‌డ్డారే!

By:  Tupaki Desk   |   19 Feb 2019 7:52 AM GMT
జ‌గ‌న్ వ్యూహానికి!... బాబు బోల్తా ప‌డ్డారే!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... వ్యూహ ర‌చ‌న‌లో బాగానే రాటుదేలార‌నే చెప్పాలి. ఎందుకంటే... 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డంతో పాటుగా దేశంలోనే త‌న‌కంటే సీనియ‌ర్ పొలిటీషియ‌న్ లేర‌న్న వ్యాఖ్య‌లు చేస్తున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడినే ఆయ‌న త‌నదైన వ్యూహంతో బోల్తా కొట్టించేశారు. విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... జ‌గ‌న్ ర‌చించిన వ్యూహం ముందు చంద్ర‌బాబు నిజంగానే బోల్తా ప‌డిపోయారు. వెర‌సి ఆది నుంచి టీడీపీకి అండ‌గా కొన‌సాగుతూ వ‌స్తున్న బీసీల‌ను చంద్ర‌బాబు ఇప్పుడు దూరం చేసేసుకున్నారు. అంటే.... బీసీల పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీని ఆయ‌న బీసీల‌కే దూరం చేశార‌న్న మాట‌. ఈ వ్యూహంపై త‌న‌దైన ప‌క్కా ప్లాన్‌ తో వెళ్లిన జ‌గ‌న్‌... బాబుకు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టేశార‌ని చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మ‌ద్ద‌తు ద్వారానే కాపులు టీడీపీ ప‌క్షాన నిల‌బ‌డ్డారన్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ప‌వ‌న్ టీడీపీకి యాంటీగా త‌న కొత్త స్టాండ్ ప్ర‌క‌టించారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా... త‌న స్టాండేంటో ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ త‌న పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు - ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ ల‌పై వ్య‌క్తిగ‌తంగా అవినీతి ఆరోప‌ణ‌లు సంధించిన ప‌వ‌న్‌.. టీడీపీకి పూర్తి యాంటీనేన‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు అంత‌గా ప‌ట్టించుకోలేదు. ఏదేమైనా ఎన్నిక‌ల్లోగా మ‌రోమారు ప‌వ‌న్‌ తో దోస్తీ క‌డ‌తాన‌న్న ధీమాతోనే చంద్ర‌బాబు ముందుకు సాగారు. అయితే ప‌వ‌న్ లొంగ‌లేదు క‌దా.. టీడీపీపై మ‌రింత‌గా విరుచుకుప‌డిపోతున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు ఇక్క‌డే త‌ప్పులో కాలేశార‌ని చెప్పాలి. అయితే చంద్ర‌బాబు మాదిరిగా కాకుండా జ‌గ‌న్ వాస్త‌వాల‌ను అంచనా వేసి కాపుల‌పై త‌న స్టాండేంటో చాలా స్ప‌ష్టంగానే ప్ర‌క‌టించారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు కేంద్రం ప‌రిధిలోనిద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపులు ప‌వ‌న్ వైపే వెళ‌తార‌ని - ఎవ‌రెన్ని చేసినా... వారి ఓటింగ్ జ‌న‌సేన‌కు త‌ప్పించి మిగిలిన పార్టీల‌కు ద‌క్క‌ద‌ని జ‌గ‌న్‌ అంచ‌నా వేశారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కాపుల రిజ‌ర్వేష‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య చేశార‌ని చెప్పాలి. తాను ఈ స్టాండ్ తీసుకుంటే... బాబు కాపుల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు నానా య‌త్నాలు చేస్తార‌ని భావించిన కార‌ణంగానే జ‌గ‌న్ ఈ త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని చెప్పాలి. ఎందుకంటే... కాపుల‌కు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలో చంద్ర‌బాబు బీసీల‌ను దూరం చేసుకుంటార‌న్న‌ది జ‌గ‌న్ ప్లాన్‌. అదే స‌మ‌యంలో తాను బీసీ మంత్రం అందుకుంటే స‌రిపోతుంద‌ని కూడా ఆయ‌న ముందే త‌న వ్యూహాన్ని నిర్దేశించుకున్నారని చెప్పాలి.

జ‌గ‌న్ వ్యూహం ప్ర‌కార‌మే... కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ త‌న స్టాండ్ చెప్ప‌గానే... కాపుల‌కు అన్యాయం జ‌రిగిపోతోంద‌ని, కాపుల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ‌గ్గోలు పెట్టిన చంద్ర‌బాబు... ఇటీవ‌ల ఈబీసీల‌కు ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో ఓ 5 శాతాన్ని చీల్చేసి దానిని కాపుల‌కు ఇచ్చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా బీసీల్లోని ఉప కులాల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ల ఏర్పాటును గాలికొదిలేసిన చంద్రబాబు... కాపుల‌కు మాత్రం ప్ర‌త్యేకంగా కార్పొరేష‌న్‌ - పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించారు. కాపుల మాదిరిగానే త‌మ‌కూ కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌న్న బీసీల మాట‌ను చంద్ర‌బాబు అస్స‌లు ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. ఇదే స‌రైన స‌మ‌యం అనుకుని రంగంలోకి దిగిన జ‌గ‌న్‌... మొన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న‌లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే... బీసీల‌కు ఏం చేస్తామ‌న్న విష‌యాన్ని క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా చెప్పేశారు. అంతేకాకుండా బీసీల‌కు చంద్ర‌బాబు చేసిన న్యాయం - అన్యాయం ఏమిటో కూడా జ‌గ‌న్ వివ‌రించేశారు. కాపుల అంశాన్ని ప్ర‌స్తావించ‌కుండానే... ఇత‌ర కులాల‌కు కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు.. బీసీల్లోని ఉప‌కులాల‌కు ఎందుకు కేటాయించ‌లేద‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మొత్తంగా త‌న‌దైన మార్కు వ్యూహంతో ముందుకెళ్లిన జ‌గ‌న్‌.. టీడీపీతో కొన‌సాగుతున్న బీసీల‌ను వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యేలా చేశారన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.