Begin typing your search above and press return to search.

ఆర్కే బీచ్ బాధ్యతకు ‘జగన్’ రెఢీ

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:50 AM GMT
ఆర్కే బీచ్ బాధ్యతకు ‘జగన్’ రెఢీ
X
చేసేవాడు పెద్దగా మాట్లాడడు. చేయనోడు నిత్యం అదే పనిగా మాట్లాడేస్తుంటారు.దీనికి నిలువెత్తు రూపాలుగా ఏపీ అధికార.. ప్రతిపక్ష నేతల తీరు కనిపిస్తుంది. ఏపీ ప్రత్యేక హోదా కోసం గురువారం విశాఖ ఆర్కే బీచ్ లో మౌనదీక్ష.. కొవ్వొత్తుల ప్రదర్శన చేసేందుకు ఏపీ యువత సిద్ధం కావటం తెలిసిందే. ఈ నిరసన దీక్షకు పవన్ నేతృత్వంలోని జనసేన.. ఏపీ విపక్షం వైఎస్ జగన్ తమ సంపూర్ణ మద్దతు ఇచ్చేయటం తెలిసిందే.

హోదాపై నిరసనను ఆర్కే బీచ్ కే పరిమితం చేయకుండా.. ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తానికి చేరే దిశగా సరికొత్త పిలుపునిచ్చింది జగన్ పార్టీ. ఆర్కే బీచ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. జగన్ బ్యాచ్ మొత్తం రంగంలోకి దిగింది. నిన్నటికి నిన్న ఏపీ వ్యాప్తంగా ఉన్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హోదా మీద నిరసన అంశంపై స్పందించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాదిరి.. ఏపీ ముఖ్యమంత్రి హోదా మీద ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేరంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం దగ్గర అరచేతి మందాన పరపతి ఉందని చెప్పుకునే చంద్రబాబు.. కేంద్రంలో తాను చక్రం తిప్పుతున్నానని గొప్పలు చెప్పే చంద్రబాబు.. ఏపీకి ఎంతో కీలకమైన హోదా విషయంలో తన పలుకుబడిని ఎందుకు ఉపయోగించటం లేదన్నది పెద్ద ప్రశ్న?

ఇదే విషయాన్ని తమదైన రీతిలో ప్రశ్నిస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు.. జనవరి 25న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో హోదా కోసం నిరసన దీక్షల్లో భాగంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్కే బీచ్ లో ఏపీ యువత చేపట్టాలని భావిస్తున్న మౌనదీక్షకు సంబంధించి జగన్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిరసన దీక్షకు పోలీసులు అనుమతులులేవని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. జగన్ పార్టీ రంగంలోకి దిగి.. అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది.

అంతేకాదు.. ఏదైనా అనుకోని సంఘటన జరిగినా తామే బాధ్యత వహిస్తామని.. కావాలంటూ ఆ విషయాన్ని రాసి ఇస్తామని చెబుతోంది. నిజానికి.. ఆర్కే బీచ్ లో నిర్వహిస్తున్న మౌనదీక్షకు జగన్ పార్టీ కేవలం మద్దతు మాత్రమే ఇస్తోంది. కానీ.. అనుమతుల పేరుతో ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తమ పూచీకత్తు ఇచ్చేందుకు సైతం తాను సిద్ధమన్న విషయాన్ని జగన్ పార్టీ నేతలు స్పష్టం చేయటం చూస్తే.. తక్కువ మాటలు ఎక్కువ పని జరిగేలా జగన్ పావులు కదుపుతున్న వైనం ఇట్టే కనిపిస్తుందని చెప్పక తప్పదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/