Begin typing your search above and press return to search.

పక్కా వ్యూహం : రెబెల్స్ పని పట్టేస్తున్న జగన్

By:  Tupaki Desk   |   21 Oct 2022 9:29 AM GMT
పక్కా వ్యూహం : రెబెల్స్ పని పట్టేస్తున్న జగన్
X
ఏ పార్టీలో అయినా తిరుగుబాట్లు ఉంటాయి. అసంతృప్తులు ఉంటాయి. అవి కలుపు మొక్కలా పెరిగి అసలైన వారికి ఇబ్బంది పెడితే పార్టీలో పచ్చదనమే పోతుంది. అదే టైం లో విజయావకాశాలను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల కఠిన నిర్ణయాలు తీసుకుని అయినా రెబెల్స్ మీద యాక్షన్ తీసుకోవడం అనివార్యం. అయితే ఇది మాటలు చెప్పినంత తేలిక కాదు, చాలా మందికి తెలిసినా చేయలేరు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో తాను చేయాలనుకున్నది చేసి తీరుతారు.

ఆ సంగతి పార్టీలోనే కాదు, బయటవారికి కూడా తెలుసు. వైసీపీలో ఇపుడు రెబెల్స్ అని పేరు పెట్టి కొందరు మీద వేటు వేస్తున్నారు. ఈ నంబర్ ఇంకా పెరుగుతుంది అనే అంటున్నారు. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా పొన్నూరులో రెబెల్ లీడర్ అని చెప్పి రావి వెంకట రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రావి వెంకట రమణ టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు. ఆయన వైసీపీలో చేరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ ఓడారు. ఆయనకే 2019 ఎన్నికల్లో టికెట్ అని వైసీపీలో మొదట్లో చెప్పినా ఆఖరు నిముషంలో పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు అల్లుడు అయిన కిలారి రోశయ్యకు అక్కడ టికెట్ ఇవ్వడంతో రావి తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారు.

అయినా సరే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు న్యాయం జరుగుతుంది అని రావి భావించారు. కానీ ఆ దిశగా ఏమీ జరగలేదు. దాంతో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజకీయం స్టార్ట్ చేసారు. దీని మీద అనేక సార్లు పార్టీ అధినాయకత్వం వద్ద పంచాయతీలు జరిగాయి. అయినా సరే సీన్ మారకపోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో రోశయ్యకే మళ్ళీ టికెట్ ఇస్తారు అని తేలడంతో రావి మీద వేటు వేశారని అంటున్నారు.

ఇపుడు పొన్నూరులో రోశయ్యకు లైన్ క్లియర్ అయింది. ఇదే విధంగా క్రిష్ణా జిల్లా .. పామ‌ర్రు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌పైనా తాజాగా పార్టీ నుంచి స‌స్పెండ్‌ చేశారు. ఆయన కూడా 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపడ్డారు. కైలె అనిల్ కుమార్ కి టికెట్ అక్కడ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అయినా తనకు టికెట్ ఖాయమని ఆయన అనుకుంటున్నారు. కానీ అధినాయకత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడంలేదు.

దాంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అన్న సమాచారం తో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది రెండవ వేటు. ఇదే విధంగా చాలా పెద్ద జాబితాయే అధినాయకత్వం వద్ద ఉంది అంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీలో టికెట్ల కోసం డిమాండ్ చేసే వారి సంఖ్య పెద్దగా ఉంది. దాంతో పాటు గెలుపు గుర్రాలు కాని వారు కూడా తమకు టికెట్ కావాలని అంటున్నారు.

పార్టీకి పనికి వస్తారు అనుకున్న వారిని బుజ్జగించి నామినేటెడ్ పదవులు ఇస్తున్న అధినాయకత్వం ఇక లాభం లేదు అనుకున్న వారికి మాత్రం వేటు వేసి బయట దారి చూపిస్తోంది అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన చోట్ల రెబెల్స్ గా ఎవరైనా మారాలనుకుంటే సర్దుకుంటారు అన్నది ఒక ఆలోచన. ఒక వేళ సర్దుకోకుండా పార్టీకి నష్టం చేయాలని చూసినా ఎన్నికల దాకా వీరిని మోసి అతి పెద్ద నష్టం తెచ్చుకోవడం కంటే ఇప్పటి నుంచే సాగనంపితే పార్టీ అక్కడ బలోపేతం అవుతుంది అన్నది వైసీపీ అధినాయకత్వం పక్కా వ్యూహం అంటున్నారు. మరి రెబెల్స్ మీద ఈ వేటు చాలా నియోజకవర్గాలలో వైసీపీ నేతలలో దడ పుట్టిస్తోంది అంటున్నారు. వారి దారికి వస్తారా లేక బయట దారిన వెళ్తారా అన్నది చూడాల్సి ఉందిపుడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.