Begin typing your search above and press return to search.

జగన్ వారితో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా?

By:  Tupaki Desk   |   20 April 2019 6:13 AM GMT
జగన్ వారితో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా?
X
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు కావొస్తూ ఉన్నాయి. ఫలితాలకు మాత్రం ఇంకా నెల రోజులకు పైనే వేచి చూడాల్సిన పరిస్థితి. పోలింగ్ సరళిని - పోలింగ్ అనంతర పరిణామాలను బట్టి చూస్తే మాత్రం.. విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు గగ్గోలు పెడుతున్న తీరును చూసినా.. విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వరించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

అయితే విజయం విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీమాగా కనిపిస్తూ ఉంది. నిన్న కర్నూలులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో కన్నా తాము ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని ప్రకటించుకున్నారు. తెలుగుదేశంలోని ఇతర నేతలు కూడా తమకే అనుకూల ఫలితాలు అనే ధీమాతో కనిపిస్తూ ఉన్నారు.

ఇలా ఎవరికి వారు ధీమాగా ఉన్నారు ఫలితాల విషయంలో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటికే పలువురు నేతలు జగన్ ను కలిసి.. తమకు మంత్రి పదవులు కేటాయించాలనే కోరికలను వెల్లుబుచ్చుతున్నారని సమాచారం. వారిలో కొందరికి జగన్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫలితాలు సానుకూలంగా వచ్చిన పక్షంలో జగన్ ఎవరెవరితో కేబినెట్ ను ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు కూడా మొదలయ్యాయిప్పుడు.

అందుకు సంబంధించి మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతూ ఉంది. పార్టీకి సానుకూల ఫలితాలు వస్తే…. తనతో సహా మొత్తం తొమ్మిది మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచనల మేరకు జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని అంటున్నారు!

మొత్తం తొమ్మిది మంది సభ్యులతో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతోందట. అందుకు సంబంధించిన పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయిప్పుడు. వీరందరూ జగన్ ను కలిసి మంత్రి పదవుల విషయంలో విన్నతులు అందించినట్టుగా సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో వీరి విషయంలో జగన్ కూడా సానుకూలంగా ఉన్నారని టాక్!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని - బాలినేని శ్రీనివాస రెడ్డి - అనిల్ కుమార్ యాదవ్ - బాలనాగిరెడ్డి - అంజాద్ భాషా - మోపిదేవి వెంకటరమణ - ఆర్కే రోజా - కొడాలి నాని - ధర్మాన ప్రసాదరావులకు బెర్తులు ఖరారు అయినట్టుగా సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… వైఎస్ జగన్ తో కలిసి మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి అసలు కథ ఎలా ఉంటుందనేది మే ఇరవై మూడు ఫలితాలు వస్తే కానీ తెలియదు!