Begin typing your search above and press return to search.

జగన్ వ్యూహాత్మక నిర్ణయం

By:  Tupaki Desk   |   19 March 2021 4:30 AM GMT
జగన్ వ్యూహాత్మక నిర్ణయం
X
కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ మేయర్ పోస్టులకు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఏలూరు మినహా మిగిలిన 11 కార్పొరేషన్లకు ఫలితాలు వచ్చేశాయి. వీటన్నింటినీ వైసీపీనే గెలుచుకుంది. ఇక్కడే జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎలాగంటే 11 కార్పొరేషన్లకు మేయర్ ఎంపికలో బీసీ, మహిళలకు పెద్దపీట వేశారు. విచిత్రమేమిటంటే జనరల్ స్ధానాల్లో కూడా బీసీలను ఎంపిక చేయటం.

మేయర్లుగా బాధ్యతలు తీసుకున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరు రాజకీయాలకే కొత్తం. అనుభవం ఉన్న వారిలో కూడా కడప మేయర్ సురేష్ బాబు తప్ప మిగిలిన ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నా మేయర్ పీఠం అందుకోవటం మొదటిసారే. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం కార్పొరేషన్లకు మహిళలనే మేయర్లుగా ఎంపికచేశారు. వీరిలో ఒంగోలు, విజయవాడ మేయర్లు తప్ప మిగిలిన వారందరు రాజకీయాలకే కొత్త.

గుంటూరు, కర్నూలు మేయర్లుగా ఎంపికైన కావటి మనోహర్ నాయుడు, బివై రామయ్యలు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక అనంతపురం మేయర్ గా ఎన్నికైన వసీం సలీం మొదటిసారి కార్పొరేటర్ గా పోటీ చేశారు. గెలిచిన వెంటనే మేయర్ కుర్చీలో కూర్చున్నారు. ఇక విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం మేయర్ పోస్టులు జనరల్ క్యాటగిరీనే అయినా ఇక్కడ జగన్ బీసీలనే ఎంపికచేశారు. అలాగే అనంతపురం కూడా జనరల్ సీటే అయినా మైనారిటి(బీసీ) వ్యక్తిని ఎంపికచేశారు.

మొత్తం 11 కార్పొరేషన్ మేయర్ పోస్టుల్లో 8 మందిని బీసీ+మైనారిటిలను ఎంపిక చేయటం వెనుక దీర్ఘకాల ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు అర్ధమవుతోంది. మొత్తం జనాభాలో బీసీలదే 50 శాతం అన్న విషయం తెలిసేందే. బీసీలను పర్మినెంట్ ఓటుబ్యాంకుగా తయారు చేసుకునేందుకే జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీల్లో కూడా మహిళలకే ఎక్కువ స్ధానాలు కేటాయించారు. ఇప్పటికే సంక్షేమపథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా రాజకీయ పదవుల్లో కూడా బీసీ మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు.

బీసీలు మొదటినుండి తెలుగుదేశంపార్టీనే అంటిపెట్టుకున్నారన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా 2019 ఎన్నికల్లోనే బీసీల్లో చీలిక వచ్చి కొన్నివర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. టీడీపీ ఘోరఓటమికి ఇది కూడా ఓ కారణమే. కాబట్టి మొత్తం బీసీలనే టీడీపీకి శాశ్వతంగా దూరం చేయాలనే వ్యూహంతో జగన్ పావులు కదుపుతున్నారు. మేయర్ పోస్టులే కాదు 74 మున్సిపల్ ఛైర్మన్ పోస్టుల్లో 43 బీసీలకే కేటాయించారు.

2019 ఎన్నికల్లో ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీ టికెట్లు కానీ తర్వాత బీసీ కార్పొరేషన్ల భర్తీకానీ, తాజాగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికలో కానీ బీసీలకు పెద్దపీట వేశారంటూ చాలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారని అర్ధమైపోతోంది. మరి దీని ఫలితం రాబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కనబడుతుందేమో చూడాలి.