Begin typing your search above and press return to search.

బాబు ఎన్నికల ఐడియాను..జగన్ జనం కోసం చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   27 Nov 2019 1:05 PM GMT
బాబు ఎన్నికల ఐడియాను..జగన్ జనం కోసం చేస్తున్నారు!
X
క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ. ఈ ప‌రిశ్ర‌మ మొదటి అడుగు పడింది.. వైఎస్ హ‌యాంలోనే. అప్ప‌ట్లో బ్రాహ్మ‌ణి పేరుతో ఈ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల అది మూల‌న‌ప‌డింది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఈ విష‌యాన్ని విభ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్నారు. కేంద్రం త‌న సొమ్ముతో ఈ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పాత్ర వ‌హిస్తుంది. అయితే, ఈ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు మాత్రం ఓటర్లను ఆకర్షించడానికి ఓ శిలాఫలకం వేశారు.

రాజకీయ కోణంలో క‌డ‌ప‌లో బ‌లోపేతం అవ్వాల‌ని - ముఖ్యంగా వైసీపీకి కంచుకోట వంటి ఈ జిల్లాలో టీడీపీ జెండా ఎగ‌రాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు ఆమేర‌కు అక్క‌డ వ్యూహ‌ ప్ర‌తివ్యూహాలు ర‌చించి అమలు చేశారు. అవి ఫలించలేదు. కడపలో ఉక్కు అక్క‌డ సెంటిమెంట్ అంశం. ఉక్కు ఫ్యాక్ట‌రీ రావ‌డం వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిని ఏర్పాటు చేయ‌డం అనే విష‌యాన్ని చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. నెపం బీజేపీ మీద నెట్టి తాను బయటపడదాం అనుకున్నారు.

ఈ క్ర‌మంలోనే అప్ప‌టి టీడీపీ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌ తో నిరాహార దీక్ష చేయించారు. కేంద్రం స్పందించాల‌ని ర‌గ‌డ‌కు దిగారు. అయితే, దీనిపై కేంద్రం స్పందించేలోగానే.. చంద్ర‌బాబే హాడావుడిగా దీనికి శంకు స్థాప‌న చేశారు. ఇది పూర్తిగా ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన స్టంటేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో చంద్ర‌బాబుకు అనుకున్న‌ది ద‌క్క‌క పోగా.. ఉన్న‌ది కూడా పోయినంత పనైంది. ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై స్పందించిన జ‌గ‌న్‌.. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించారు. అది కూడా పూర్తి మౌలిక స‌దుపాయాలతో దీనిని ఏర్పాటు చేయ‌నున్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇనుప ఖనిజం కోసం ఎన్ ఎండీసీతో ఒప్పందం చేసుకుంటారు. ఇక‌, ఇప్ప‌టికే చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేసినా.. దాని వెనుక ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో ఇప్పుడు డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌ కు శంకుస్థాపన చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకోవ‌డం విశేషం. చంద్ర‌బాబు ఐదేళ్లు వేచి చూసి ఎన్నిక‌ల అంశంగా కడప ఉక్కును వాడుకునే ప్రయత్నం చేస్తే... ఇప్పుడు జ‌గ‌న్ త‌న పాల‌న ప్రారంభంలోనే దీనిని మొద‌లు పెట్ట‌డం విశేషంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సిసలైన అభివృద్ధి కాముకుడిగా స్థానికులు జగన్ ను కీర్తిస్తున్నారు.