Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ విస్తరణ..నలుగురు మంత్రులు అవుట్..!

By:  Tupaki Desk   |   19 March 2020 12:30 AM GMT
ఏపీ కేబినెట్ విస్తరణ..నలుగురు మంత్రులు అవుట్..!
X
త్వరలో ఏపీ కేబినెట్ లో ఊహించని మార్పులు జరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ వర్గాల సమాచారం మేరకు అతి త్వరలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడటం, అలాగే మరోవైపు ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న ఇద్దరు మంత్రులు కూడా రాజ్యసభకు వెళ్లబోతుండటంతో ..సీఎం జగన్ కేబినెట్ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాగే కేబినెట్ విస్తరణతో పాటుగా ..కొందరు మంత్రుల శాఖలలో కూడా మార్పులు జరగవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడటం - ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యలతో పాటు ఇతరత్రా కారణాలతో కేబినెట్ లో పలువురు మంత్రులను బయటకి పంపి , కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అని అధికారికంగా చెప్పకపోయినా లోలోపల దీనిపై చర్చలు జరుగుతున్నట్టు వైసీపీ వర్గాల సమాచారం.అయితే , మొదటగా కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న వారిలో ఇద్దరు మహిళలతో పాటు మొత్తం నలుగురు మంత్రులు తమ పదవుల్ని కోల్పోబోతున్నారు. అయితే , మోపిదేవి వెంకట రమణారావు - పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి రద్దు ప్రతిపాదనల నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లనుండటంతో ఆ నలుగురిలో ఈ ఇద్దరు ఉన్నారా? లేదా ? అనేది తెలియదు.

రాజ్యసభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ ఖాయం అని మాత్రం తెలుస్తుంది. మొత్తానికి నలుగురు మంత్రుల స్ధానంలో పలువురు కొత్త ఎమ్మెల్యేలకు జగన్ క్యాబినెట్ లో చోటు దక్కవచ్చు. కేబినెట్ విస్తరణ చేస్తే ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం - రెవెన్యూ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో .. రెవెన్యూశాఖను జగన్ కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేల అదే జరిగితే పెద్దిరెడ్డి చూస్తున్న మైనింగ్ తో పాటు ఇతర శాఖలను కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే మంత్రులకి అప్పగించబోతున్నారు అని తెలుస్తుంది.

ఇక ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్తుండటంతో ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ..సీఎం జగన్ మాత్రం కేబినెట్ ప్రక్షాళన కు మొగ్గుచూపుతున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ... సీఎం జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కేబినెట్ లోకి వచ్చేటప్పుడే వారికి అవినీతి కానీ ఇతరత్రా ఆరోపణలు కానీ వస్తే ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఇచ్చారు.. మంత్రులుగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి పలువురు మంత్రులపై అందుతున్న నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నజగన్ ..ఆ కారణాలు చూపి వారిని కేబినెట్ నుండి వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అతి త్వరలో వైజాగ్ కు సచివాలయం తరలించాలని చూస్తున్నారు. ఈలోగానే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.