Begin typing your search above and press return to search.

ఇసుక అక్రమ రవాణాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:59 AM GMT
ఇసుక అక్రమ రవాణాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది
X
తాను చెప్పిన మాటను చెప్పినట్లుగా అమలు చేసే ప్రభుత్వాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావటం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా 14500 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయటం తెలిసిందే.

అంతేకాదు.. ఇసుక అక్రమ రవాణా చేపట్టిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు కూడా. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేపడితే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2లక్షల వరకూ జరిమానా విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మాటల్లో చెప్పినట్లే చేతల్లోనూ నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి తగ్గట్లే న్యాయస్థానాలు అదే తీరును పాటిస్తున్నాయి.

తాజాగా అక్రమ ఇసుక రవాణా కేసులో తొలి శిక్షను కోర్టు వెల్లడించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడప జిల్లాకు చెందిన పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె గ్రామంలో ఇసుక అక్రమ రవాణా కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు న్యాయమూర్తి నిందితులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించారు.

ప్రభుత్వం చెప్పినట్లే.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరిస్తామన్న మాటకు తగ్గట్లే తాజా తీర్పు ఉండటం ఏపీలో పరిస్థితుల్లో మార్పునకు దోహదం చేయటం ఖాయమంటున్నారు.