Begin typing your search above and press return to search.

జగన్ లక్ష్యాలు ఈ రెండే... ప్రతి అడుగూ వీటి చుట్టే

By:  Tupaki Desk   |   18 Jun 2019 1:25 PM GMT
జగన్ లక్ష్యాలు ఈ రెండే... ప్రతి అడుగూ వీటి చుట్టే
X
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కేవలం రెండంటే రెండు లక్ష్యాలతోనే ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విషయం మాట్లాడినా ఈ రెంటి చుట్టే ఆయన తిరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అవేవంటే.. నవరత్నాల అమలు - అవినీతి రహిత పాలన. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్... ప్రజలతో మమేకమై వారు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశాక... వాటిని పరిష్కరించేందుకే నవరత్నాలను రూపొందిదంచినట్లుగా పేర్కొన్న విషయం తెలిసిందే.

నవరత్నాల అమలుతో రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అంది తీరతాయన్నది జగన్ భావన. అంతేకాకుండా నవరత్నాలను అమలు చేయడం ద్వాారా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటానని కూడా జగన్ గట్టిగానే భావిస్తున్నారు. తనలోని ఈ భావనను బయటపెట్టుకునేలా ఆయన నవరత్నాలతో కూడిన ఫొటోలను తన చాంబర్ గోడలపై ముద్రించుకున్నారు. అంతేకాకుండా తన కేబినెట్ లోని మంత్రులంతా కూడా నవరత్నాలపైనే నిత్యం ఆలోచన చేసేలా వారి చాంబర్ లలోనూ ఈ ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వంలోని ప్రతి శాఖ కూడా నవరత్నాలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే దిశగానూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్కన నవరత్నాల అమలుపై జగన్ కు ఏ పాటి ఆసక్తి ఉందో ఇట్టే అర్థమైపోతోంది.

ఇక అవినీతి రహిత పాలన అంటూ జగన్ ప్రమాణ స్వీకారానికి ముందు నుంచి పదే పదే చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం సందర్బంగానూ అవినీతి రహిత పాలననను ప్రస్తావించడంతో పాటుగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తానని కూడా జగన్ శపథం చేసినంత పనిచేశారు. అవినీతి రహిత పాలన చెప్పడానికి బాగానే ఉంటుంది గానీ... దానిని అమల్లో పెట్టడమంటేనే అసలు సమస్య. ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్... రాష్ట్రంలో అవినీతి రహిత పాలనపై ప్రసంగాలు ఆసక్తికరంగానే మారాయని చెప్పాలి. ఎందుకంటే... తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల మేర అక్రమార్జనను కూడబెట్టినట్టుగా ఆరోపణలు రాగా... దానిపై సీబీఐ కేసులు నమోదు చేయడం - ఈడీ దర్యాప్తు ప్రారంభించడం - జగన్ జైలుకు వెళ్లడం - ప్రస్తుతం ఈ కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అవినీతి రహిత పాలనపై జగన్ మాట్లాడినప్పుడల్లా ఇవే పదే పదే గుర్తుకు వస్తున్నాయి.

తనపై పడిన అవినీతి మరకకు చెరిపేసేందుకైనా రాష్ట్రంలో అవినీత రహిత పాలన చేసి చూపించాలని జగన్ కంకణం కట్టుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఓ వైపు నవరత్నాల అమలు, ఇంకోవైపు అవినీతి రహిత పాలన... ఈ రెండు విషయాలే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నట్లుగా చెప్పాలి. అవినీతి రహిత పాలనకు ఖర్చేమీ కాకపోయినా.. నవరత్నాల అమలు అంటే... ఆర్థిక లోటులో ఉన్న ఏపీలో కాస్తంత ఇబ్బందే. ఆర్థిక లోటు - వేల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు... జగన్ ఎలా సమన్వయం చేస్తారన్న విషయంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది.