Begin typing your search above and press return to search.

గడపగడపలో వైసీపీ ప్రోగ్రాంలో జగన్ అసలు టార్గెట్ అదేనా?

By:  Tupaki Desk   |   13 May 2022 3:15 AM GMT
గడపగడపలో వైసీపీ ప్రోగ్రాంలో జగన్ అసలు టార్గెట్ అదేనా?
X
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో అధికార పార్టీ నిర్వహిస్తున్న గడపగడపలో వైసీపీ కార్యక్రమంపై బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. వాటిల్లో అత్యధికం వ్యతిరేక వార్తలే. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? అన్నది ఒక ప్రశ్న అయితే.. పైకి కనిపించేదంతా నిజం కాదు.. అసలు నిజం వేరే ఉందన్న మాట వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ నేతల్ని ప్రజలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికి అధినేత ఈ విషయంలో కించిత్ కూడా కంగారు పడకుండా.. మరింతలా వెళ్లాలని మంత్రుల మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పక్కాగా పాల్గొనాలన్న మాటను చెప్పటం తెలిసిందే.

పైకి చూసినప్పుడు అందరికి కనిపించే గడపగడపకూ వైసీపీ కార్యక్రమం అసలు స్కెచ్ వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం కొలువు తీరిన మూడేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి వారి బాధలు.. కష్టాలు.. సమస్యల్ని అడిగి తెలుసుకోవటం.. వాటికి పరిష్కారాలు వెతకటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక్కడే అసలు మతలబు ఉందంటున్నారు. సాధారణంగా అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వచ్చినప్పుడు వారు తమ సమస్యల చిట్టా విప్పుతారు. సహజంగానే ఈ ప్రక్రియలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది.

దాన్ని లెక్క చేయకుండా ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసిన కారణం వేరే ఉందంటున్నారు. గడపగడపకూ వైసీపీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం మొత్తం టీడీపీ అనుకూల వర్గాల్ని టార్గెట్ చేసిందన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వైసీపీ నేతలు ఎక్కువగా కలిసేది టీడీపీ సానుభూతిపరులు.. ఆ పార్టీకి బలమైన మద్దతుదారులనే మాట వినిపిస్తోంది. తాము వ్యతిరేకించే పార్టీ పాలనలో తాము వివక్షకు గురైన భావన కలగకుండా చేయటం.. మీకేం సమస్యలు ఉన్నాయి? అన్న ప్రశ్నను అడగటం ద్వారా వారిని తమకు సానుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యం ఒకటి అంతర్లీనంగా ఉందని చెబుతున్నారు.

ఇలాంటి కార్యక్రమాల్ని బయట నుంచి చూసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కనిపిస్తుంది. కానీ.. తమ రాజకీయ ప్రత్యర్థులకు బలమైన మద్దతుదారుల్ని ఈ కార్యక్రమం ద్వారా తమ వైపునకు తిప్పుకునే వ్యూహాన్ని సీఎం జగన్ ఈ కార్యక్రమంతో చేపట్టినట్లుగా చెబుతున్నారు.

అందుకే.. ఈ ప్రోగ్రాంను చేపట్టినప్పుడు ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా వస్తున్న వార్తలకు సీఎం జగన్ అస్సలు కంగారు పడటం లేదంటున్నారు. వైసీపీ నేతలు గురి పెట్టినట్లుగా తెలుగుదేశం పాలోవర్స్ మీద ఫోకస్ చేసి.. వారిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహాన్ని పకడ్బందీగా చేపట్టినట్లుగా చెబుతున్నారు. మరి.. జగన్ అనుకున్నది సాధిస్తారా? అన్నది కాలమే సరైన సమాధానాన్ని ఇవ్వగలదు.