Begin typing your search above and press return to search.

రాజధాని మార్పు.. జగన్ ఆలోచిస్తున్నారా?

By:  Tupaki Desk   |   7 July 2019 4:41 AM GMT
రాజధాని మార్పు.. జగన్ ఆలోచిస్తున్నారా?
X
ఏమో ఏదైనా జరగొచ్చు.. తాజా రాజకీయ పరిణామాలను బట్టి అమరావతి రాజధాని మార్పు జరగనూ వచ్చూ. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న హాట్ టాపిక్. ఇక ఇలా అనుమానించడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు - ఎమ్మెల్యేలు దోనకొండ మరియు చుట్టుపక్కల భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జగన్ ప్రణాళికల ప్రకారమే వీరంతా కొంటున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పడు ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దోనకొండను ఏపీ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. అయితే చంద్రబాబు మాత్రం ఈ ప్రభుత్వ భూములున్న ప్రాంతాన్ని పెడచెవిన పెట్టి రాజకీయ లబ్ధి కోసం అమరావతికి మార్చడం వివాదాస్పదమైంది. అప్పటికే అక్కడ రైతుల నుంచి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొని కోట్లకు పడగలెత్తారన్న విమర్శలు వచ్చాయి. రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. ఇక చంద్రబాబు కూడా దోనకొండలో ఇండస్ట్రీయిల్ కారిడార్ కు శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు.

వైసీపీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి ఇప్పుడు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాలోని దోనకొండకు మారిందన్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఏపీ రాజధానిని దోనకొండకు జగన్ మార్చబోతున్నారా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో రేగుతోంది.

ఏపీ రాజకీయవర్గాల్లో - అధికారులు - వైసీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఏపీ సీఎం జగన్ ఆలోచన ప్రకారం దోనకొండను పెద్ద ఇండస్ట్రీ హబ్ గా చేయాలనుకుంటున్నారని.. అక్కడికే మెజార్టీ ప్రాజెక్టులను అమరావతి నుంచి తరలించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

అయితే ఇలా అమరావతి నుంచి దోనకొండకు రాజధానిని తరలించడానికి సరైన కారణమే ఉందంటున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే దోనకొండలో ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి. అందుకే ఇది రాజధాని నిర్మాణానికి, పారిశ్రామిక కారిడార్ ల అభివృద్ధికి అనువైన ప్రాంతంగా జగన్ గుర్తిస్తున్నట్టు సమాచారం. అమరావతిలో భూములు కోల్పోయిన రైతుల నిరసన చంద్రబాబు పుట్టిపుంచిన నేపథ్యంలో వారి భూములు వారికిచ్చేసి దోనకొండకు రాజధాని మారిస్తే ఎలా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నట్టు చర్చ ఏపీ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.