Begin typing your search above and press return to search.

జగన్ కు పొంచి ఉన్న ముప్పు....?

By:  Tupaki Desk   |   13 Dec 2021 2:30 AM GMT
జగన్ కు పొంచి ఉన్న ముప్పు....?
X
జగన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వైసీపీలో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నారాయణస్వామి లేటెస్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ని చంపాలని చూస్తున్నారని ఆయన బాంబు లాంటి వార్తను బయటపెట్టారు. ఎవరు చంపుతారు అన్న సందేహానికి తావు లేకుండా చంద్రబాబు నుంచే జగన్ కి ముప్పు పొంచి ఉందని కూడా ఆరోపించారు. మొత్తానికి వైసీపీలో ఈ విధంగా సంచలన కామెంట్స్ చేసిన రెండవ నాయకుడిగా ఆయన్ని చూడాలి.

దీనికి ముందు అనంతపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆయన ఈ కామెంట్స్ చేసి ఇరవై నాలుగు గంటలు కాకుండానే నారాయణస్వామి అందుకోవడం అంటే ఇది ఏపీలో చర్చనీయాంశంగానే మారుతోంది. జగన్ని భౌతికంగా లేకుండా చేసేందుకు టీడీపీ చూస్తోందనే ఈ ఇద్దరూ తీవ్రమైన అరోపణలు చేశారు.

నిజానికి జగన్ కి ముప్పు ఉందా. అది కూడా టీడీపీ నుంచే ఉందా అన్నదే ఇపుడు చర్చ. అయితే టీడీపీ మీద కొన్ని విషయాల్లొ ఆరోపణలు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఉన్నా దేనికీ ఆధారం అయితే లేదు. అదే విధంగా టీడీపీ వారు వైసీపీ మీదనే ఇలాంటి విమర్శలు చేస్తారు. ఫ్రాక్షన్ కల్చర్, హింసా ప్రవృత్తి వైసీపీ నేతలదే అని వారు పదే పదే అంటారు.

అయితే ఇపుడు రాజకీయాల తీరు మారింది. ఏపీలో ఎన్నడూ లేని విధంగా రెండు ప్రాంతీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అంతే కాదు, రెండు పార్టీలకు అధికారం ప్రాణప్రదం అన్నది కూడా తెలిసిందే. 2024 ఎన్నికల్లో టీడీపీ పవర్ చేజిక్కుంచుకోలేకపోతే ఇక చరిత్ర పుటలకే పరిమితం. జగన్ మళ్లీ వరసబెట్టి అధికారంలోకి రెండవమారు రాకపోతే ఆయన రాజకీయ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందులో పడుతుంది అన్న చర్చ ఉంది. ఆయన మీద ఉన్న సీబీఐ కేసులు కానీ ఇతరత్రా కానీ చూసిన వారు చేసే విశ్లేషణ ఇది.

ఇక టీడీపీ ఈసారి పవర్ లోకి వస్తే ఆ కధే వేరు గా ఉంటుందని ఇప్పటి నుంచే నేతలు సౌండ్ చేస్తున్నారు. అంటే తమిళనాడు తరహాలో దెబ్బకు దెబ్బ తీరున ప్రతీకార రాజకీయం మేమూ చేస్తామని చెప్పకనే చెబుతున్నారన్న మాట. మరి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ ని దాటుకుంటూ దూకుడుగా చేస్తున్న రాజకీయంగానే చూడాలి. అయితే వీటికి మంచి భౌతికంగా ఒక నేతను లేకుండా చేయడం అంటే అది జరిగే పనేనా అన్న చర్చ కూడా ఉంది.

అయితే ఇక్కడ ఉన్నట్లుండి జగన్ ప్రాణాలకు ముప్పు అని ఎందుకు వైసీపీ నేతలు తరచూ అంటున్నారు అన్నది చూడాలి. జగన్ పాదయాత్ర చేస్తున్న టైమ్ లో విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద 2018 అక్టోబర్ 25న కోడి కత్తి దాడి జరిగింది. ఎవరు చేశారు, ఎవరు ప్రోత్సాహం అని ఈ రోజుకీ తేలని విషయం అయినా నాడు వైసీపీ నేతలు మాత్రం అధికార టీడీపీనే అనుమానిస్తూ విమర్శలు చేశారు. కానీ రెండున్నరేళ్ళుగా వారు అధికారంలో ఉండి అసలు నిజాలు చెప్పలేకపోతున్నారు.

అయితే జగన్ మీద కోడి కత్తి దాటి జరిగింది అన్నది మాత్రం నిజం. ఇక జగన్ తండ్రి, దివంగ‌త నేత వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. ఆయన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో ప్రయాణించడం వల్ల మరణించారని చెబుతున్నా ప్రత్యర్ధులు కడతేర్చారు అని నాడు వైసీపీ విమర్శించింది. నేటికీ నమ్మే వారు ఉన్నారు.

ఇక ఇపుడు జగన్ ప్రాణాలకు ముప్పు అన్న మాటకు వైసీపీ నేతలు ఈ ఘటనలతో పాటు మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్య వరద ప్రాంతాల పరామర్శకు వెళ్ళినపుడు చంద్రబాబు తిరుపతిలో చేశారని చెబుతున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ఉటంకిస్తూ వారు మాట్లాడుతున్నారు. గాల్లో వచ్చాడు, గాల్లో పోతాడు అని బాబు అన్నారని వైసీపీ నేతల అభియోగం. అయితే బాబు అన్నది అది కాదు, 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో గెలిచాడు, 2024లో టీడీపీ గాలిలో ఓడిపోతాడు అన్న అర్ధం లో చెప్పారు అని తమ్ముళ్ళు అంటున్నారు.

ఇక ఈ మధ్య ఖమ్మంలో జరిగిన కమ్మ సామాజికవర్గం కార్తీక సమారాధనలో మల్లది వాసు అనే మాజీ టీడీపీ తమ్ముడు, టీయారెస్ కౌన్సిలర్ ఏపీ రాజకీయాల మీద చేసిన హాట్ కామెంట్స్ కూడా వారు గుర్తు చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను చంపిన వారికి యాభైల్ లక్షలు ఇస్తామని వాసు చెప్పినట్లుగా వచ్చిన వార్తల మీద వైసీపీ ఇపుడు జగన్ కి ఆపాదించి ఆయనకు ప్రాణహాని అంటోంది.

అయితే రాజకీయాల్లో చెప్పేవన్నీ కూడా ఎపుడూ నిజాలు కాదు, అలాగే అబద్దాలూ కాదు, నేతలు కూడా ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఉంటారు. జగన్ కి ప్రాణ హాని అన్నది సింపతీగా చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది, అది ఎన్నికలలో ఓడిపోతామని భయం తప్ప మరేమీ కాదని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి జగన్ ప్రాణాలకు ముప్పు అంటూ వైసీపీ నుంచి రోజుకొక నేత వేడి వేడి కామెంట్స్ తో ఏపీని హీటెక్కిస్తున్నారు. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో. ఈ రకమైన ప్రచారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.