Begin typing your search above and press return to search.

దాని నుంచి త‌ప్పించుకోవ‌డానికే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల అజెండా: మాజీ సీఎస్ సంచ‌ల‌న ట్వీట్

By:  Tupaki Desk   |   7 Oct 2022 6:46 AM GMT
దాని నుంచి త‌ప్పించుకోవ‌డానికే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల అజెండా:  మాజీ సీఎస్ సంచ‌ల‌న ట్వీట్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని ఇటీవ‌ల వ‌ర‌కు కాస్త గ‌ట్టిగానే అంత‌టా చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌భుత్వంపై పూర్తి స్థాయిలో వ్య‌తిరేక‌త పెర‌గ‌క‌ముందే ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని విశ్లేష‌కులు కూడా భావించారు. అంతేకాకుండా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూడా ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని.. ఆ దిశ‌గా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని త‌మ శ్రేణుల‌ను అప్ర‌మ‌త్తం కూడా చేశాయి. ఆయా పార్టీల స‌మావేశాల్లోనూ ఇరు పార్టీల అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ నాయ‌కుల‌కు ముంద‌స్తు ఎన్నిల‌కు సంబంధించి దిశా నిర్దేశం కూడా చేశారు.

ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు కూడా నిర్వ‌హించారు. జిల్లాల‌వారీగా స‌మీక్ష‌లు చేప‌ట్ట‌డం, అభ్య‌ర్థుల ఎంపిక‌పైనా దృష్టి సారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల్లో కూరుకుపోయింద‌ని.. ఉచిత ప‌థ‌కాలకు ప్ర‌జ‌ల‌కు పంచిపెట్ట‌డానికి ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు లేవ‌ని.. దీంతో ఆయా ప‌థ‌కాలు ఆగిపోతాయ‌నే చ‌ర్చ భారీ ఎత్తున సాగింది. ఉచిత ప‌థ‌కాలు ఆగిపోతే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయం కాబ‌ట్టి వైఎస్ జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతార‌ని భావించారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరిట ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వం వ‌ల్ల ఆయా కుటుంబాల‌కు క‌లిగిన ల‌బ్ధిని వివ‌రిస్తున్నారు.

మరోవైపు ప్ర‌భుత్వం తాము గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాటిలోనూ, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న‌వాటిలోనూ 98 శాతం హామీల‌ను నెర‌వేర్చామ‌ని చెప్పుకుంటోంది. మంత్రులు, ప్రభుత్వ స‌ల‌హాదారులు త‌దిత‌రులు సైతం ఇదే విష‌యాన్ని నొక్కివ‌క్కాణించారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు వ‌స్తాయ‌ని ఢంకా బజాయించి చెబుతున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలోనూ త‌మదే గెలుపు అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ముదిరి ఉచితాల పంపకం కష్ట సాధ్యమవుతున్నది. ఈ సమస్య నుంచి తప్పించుకొని ముందస్తు ఎన్నికల నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు రాజధానుల అజెండా ముందుకు తెచ్చినట్లు కనిపిస్తున్నది అంటూ ఆయ‌న‌ ట్వీట్ చేశారు. త‌న ట్వీట్‌ను వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీల‌కు ట్యాగ్ చేయ‌డం విశేషం. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కీల‌క శాఖ‌ల‌కు కార్య‌ద‌ర్శిగా, ముఖ్య కార్య‌ద‌ర్శిగా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐవైఆర్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌పైన ట్విట్ట‌ర్‌లో తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.