Begin typing your search above and press return to search.

48గంటల్లో వైసీపీ జాబితా..?

By:  Tupaki Desk   |   11 March 2019 4:12 PM IST
48గంటల్లో వైసీపీ జాబితా..?
X
ఏపీలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 115మందితో తొలి జాబితా సిద్ధం చేశారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ కూడా జోరు పెంచింది.

తాజాగా జగన్ ఈరోజు కాకినాడ సమరశంఖారావంలో పాల్గొన్నారు. ఇటు శంఖారావంతోపాటు అటు అభ్యర్థులు ఖరారు మీద కూడా వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. జగన్ రేపటిలోగా మొత్తం అభ్యర్థులపై సమీక్షించి ఫైనల్ చేయాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం కొన్ని చర్చలు సాగుతున్నాయి. వారందరినీ ఈరోజు జగన్ పిలిపి సీట్ల పంపకాల విషయంలో ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది.

జగన్ నుంచి ఈరోజు అందరికీ పిలుపు వెళ్లినట్లు సమాచారం. ఈరోజు, రేపు పగలంతా కూడా వివాదాలు లేని నియోజకవర్గాల సీట్లను కొలిక్కి తెచ్చి ప్రకటించేందుకు జగన్ రెడీ అయినట్లు సమాచారం. అన్నీ కుదిరితే రేపు సాయంత్రం మెజారిటీ సీట్లకు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయాలని వైసీపీ అధిష్టానం రెడీ అయినట్లు తెలుస్తోంది.

గ్రేటర్ రాయలసీమ పరిధిలోని సీమ నాలుగు జిల్లాలు - నెల్లూరు - ప్రకాశం జిల్లాల్లో దాదాపు 90శాతానికి పైగా సీట్ల విషయంలో అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. పంచాయతీ ఉన్న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై చర్చలు సాగుతున్నాయని.. మూడు నాలుగురోజుల్లోనే వాటిని ఫైనల్ చేస్తారని తెలిసింది.

ముమ్మాటికీ రేపు సాయంత్రంలోగా వైసీపీ అభ్యర్థుల మెజారిటీ జాబితాను ప్రకటించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారట.. అధికారికంగా రేపు వైసీపీ జాబితా రిలీజ్ కావడం ఖాయమని వైసీపీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.