Begin typing your search above and press return to search.

జగన్ ఉవాచ : ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాల్సిందే!

By:  Tupaki Desk   |   23 Oct 2017 4:33 PM GMT
జగన్ ఉవాచ : ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాల్సిందే!
X
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో.. విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కకపోవడం అనేది.. ఖచ్చితంగా ఆయన అనుచరులకు నిరాశే. అలాగే దీనికోసం బాగా ఎదురుచూసిన వారిలో ఆగ్రహం కూడా కలుగుతోంది. ఈ ఆగ్రహంతో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా చెబుతూ నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలు పార్టీ ఎమ్మెల్యేలు అంతా గైర్హాజరు అవుదాం అనే ప్రతిపాదన కొందరు ఎమ్మెల్యేలనుంచి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం ఈ ప్రతిపాదనకు నో చెప్పారని, చట్టసభకు ప్రతినిధిగా గెలిపించిన ప్రజల పట్ల మనకు బాధ్యత ఉంది గనుక.. సభకు వెళ్లి తీరాల్సిందేనని ఆయన సూచించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

నవంబరు 2 వ తేదీనుంచి ఆరు నెలల పాటు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయదలచుకున్నారు. సో - ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా సరే.. ఈ ఆరునెలల వ్యవధిలోగానే జరుగుతాయన్నది ఆయనకు తెలియకుండానే యాత్ర షెడ్యూలు ప్లాన్ చేసుకున్నారని అనుకోవడం భ్రమ. తాను వ్యక్తిగతంగా అసెంబ్లీకి ఈ విడత సమావేశాలకు వెళ్లకపోయినా పర్లేదనే ఉద్దేశంతోనే ఆయన యాత్ర షెడ్యూలును నిర్ణయించుకున్నారు. అయితే పాదయాత్ర చేస్తున్నారు గనుక... ఆయన గైర్హాజరు కావడంలో అర్థముంది. ప్రజల సమస్యలు చర్చించడానికి ఇక్కడ సభకు రాకున్నా, ప్రజల మధ్యలోనే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్నానంటూ.. సమర్థించుకోవచ్చు. అయితే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొడితే.. ఏం చెప్పి సమర్థించుకుంటారు? ఇదే లాజిక్ ను జగన్ లేవనెత్తినట్లుగా తెలుస్తోంది.

తమ పార్టీనుంచి ఫిరాయించిన వారు మంత్రులయ్యారు గనుక.. వారు అక్కడుండగా తాము సభకు వెళ్లం అనే వాదనలో బలం లేదని, అలాంటి భావనతో ఉంటే గనుక.. రాబోయే ఏడాదిన్నర రోజులూ తాము సభకు వెళ్లలేం అని.. కనుక ప్రజల పట్ల తమ బాధ్యత నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లి తీరాల్సిందేనని జగన్ చెప్పారుట. పైగా అసెంబ్లీకి వెళ్లకపోతే.. సభకు వచ్చి చర్చలో పాల్గొనే శ్రద్ధ కమిట్ మెంట్ కూడా ఈ పార్టీ వారికి లేదనే విమర్శలు వస్తాయని, అలాంటి వాటికి మనం ఆస్కారం ఇవ్వకూడదని సూచించారుట.

జగన్ మరో ప్రత్యామ్నాయం కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర సాగుతున్న సమయంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల గుండా తన యాత్ర సాగుతోంటే గనుక.. వారు, ఆ రోజుల్లో మాత్రం అసెంబ్లీకి గైర్హాజరై యాత్రలో పాల్గొంటే చాలునని.. మిగిలిన అందరూ శాసనసభకు వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాల్సిందేనని తేల్చిచెప్పారుట. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టమైన దిశానిర్దేశం.. ఈనెల 26న జరిగే వైసీఎల్పీ సమావేశంలో ఉంటుందని అనుకుంటున్నారు.