Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ విశాఖ రాజ‌ధాని క‌ల‌ను ఇలా నెర‌వేర్చుకోబోతున్నారా?

By:  Tupaki Desk   |   13 July 2022 9:30 AM GMT
జ‌గ‌న్ విశాఖ రాజ‌ధాని క‌ల‌ను ఇలా నెర‌వేర్చుకోబోతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే మూడు రాజ‌ధానులంటూ శాస‌న‌స‌భ‌లో తీర్మానం పెట్టి ఆ బిల్లును ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. అలాగే రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి, ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం, న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలు ఉంటాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపై నిప్పులు చెరిగిన అమ‌రావ‌తి రాజధాని రైతులు, ప్ర‌తిప‌క్ష పార్టీలు, వివిధ స్వ‌చ్ఛంధ సంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం, హైకోర్టులోనూ సీఎం వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యానికి చుక్కెదురు కావ‌డం తెలిసిందే. మూడు రాజ‌ధానుల బిల్లు చెల్ల‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్డీఏని ర‌ద్దు చేస్తూ ఆమోదించిన బిల్లుల‌ను, వాటికి సంబంధించిన జీవోల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్రభుత్వం తెలిపింది.

అయితే మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం నుంచి ప్ర‌భుత్వం వెన‌క్కి వెళ్లేది లేద‌ని.. న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్త‌కుండా మ‌రింత బ‌లంగా ఆ బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్రమంలో జూలై 8, 9 తేదీల్లో నిర్వ‌హించిన వైఎస్సార్సీపీ ప్లీనరీలోనూ మూడు రాజ‌ధానుల‌పై తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ విశాఖ నుంచి పాల‌న సాగించ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. విశాఖ‌లో క్యాంప్ ఆఫీసు మాత్ర‌మే పెడ‌తార‌ని అంటున్నారు. ఇలా చేస్తే కోర్టు నుంచి ఇబ్బందులు ఉండ‌వ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వారంలో ఐదు రోజులు సీఎం జ‌గ‌న్ విశాఖ‌లోనే ఉండి ప‌రిపాలిస్తార‌ని చెబుతున్నారు. మిగిలిన రెండు రోజులు అమ‌రావ‌తిలో ఉంటార‌ని అంటున్నారు. ఇందుకు గ‌ల అవ‌కాశాల‌ను సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ గానే ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నెలాఖ‌రు నుంచి శ్రావ‌ణ మాసం ప్రారంభ‌మవుతుంది. స‌హ‌జంగానే ఈ నెల‌లో పెళ్లిళ్లు, గృహ ప్ర‌వేశాలు, ఇతర శుభ కార్యాలు జ‌రుపుతుంటారు. ఈ నేప‌థ్యంలో శ్రావ‌ణ‌మాసంలోనే విశాఖ కేంద్రంగా పాలన సాగించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. వ‌చ్చే రెండేళ్లు అంటే 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు విశాఖ కేంద్రంగానే పాల‌న సాగిస్తామ‌ని పేర్కొంటున్నారు.

క్యాంప్ ఆఫీసు కోసం భ‌వ‌నాల‌ను కూడా చూశార‌ని స‌మాచారం. విశాఖ బీచ్ రోడ్డు, రుషికొండ త‌దిత‌ర ప్రాంతాల్లో సీఎం క్యాంపు ఆఫీసు కోసం అనుకూల‌మైన భ‌వ‌నాల‌ను విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ చూస్తున్నార‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్ విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న సాగిస్తే ప్ర‌తిప‌క్షాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు.