Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టే ప్ర‌క‌ట‌న చేయ‌నున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   30 May 2019 4:49 AM GMT
తెలుగు త‌మ్ముళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టే ప్ర‌క‌ట‌న చేయ‌నున్న జ‌గ‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినంత‌నే తెలుగు త‌మ్ముళ్ల‌కు గుండెల‌దిరిపోయే ప్ర‌క‌ట‌న ఒక‌టి జ‌గ‌న్ చేస్తారా? అంటే అవున‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భూవ్య‌వ‌హారాల‌పై దృష్టి సారించ‌నున్న జ‌గ‌న్‌.. న్యాయ విచార‌ణ‌కు ఆదేశాలు ఇవ్వ‌టం ఖాయ‌మంటున్నారు. జ‌గ‌న్ నోటి నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే.. న్యాయ విచార‌ణ కోసం సిట్టింగ్ న్యాయ‌మూర్తిని కేటాయించాల‌ని కోరుతూ అధికారులు అడ‌గ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

అమ‌రావ‌తి కోసం ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన భూస‌మీక‌ర‌ణతో పాటు.. ఇత‌ర అంశాల వివ‌రాల్ని అందించాల‌ని సీఆర్డీయే అధికారులకు ఇప్ప‌టికే ఆదేశాలు అందాయి.అమ‌రావ‌తి ప‌రిధిలోని 29 గ్రామాల్లో సీఆర్డీయే.. రెవెన్యూ అధికారులు చేసిన త‌ప్పుల్ని వెలికి తీయ‌టంతో పాటు.. వాటి వెనుక ఎవ‌రున్నార‌న్న విష‌యంపై జ‌గ‌న్ స‌ర్కారు దృష్టి సారించ‌నుంది.

ఇప్ప‌టికే అమ‌రావ‌తి భూముల విష‌యంలో నివేదిక త‌యారీలో సీఆర్డీయే అధికారులు త‌ల‌మున‌క‌లై ఉన్నార‌ని.. త్వ‌ర‌లో వారి నుంచి నివేదిక రానున్న‌ట్లు చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అమ‌రావ‌తి భూముల మీద నివేదిక ఇవ్వ‌మ‌ని అడిగిన జ‌గ‌న్‌.. కొన్ని అంశాల‌కు సంబంధించిన వివ‌ర‌ణ ఇవ్వాలని కోరారు. వాటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

భూసేక‌ర‌ణ‌.. కేటాయింపున‌కు సంబంధించి కొన్ని అంశాలు ఇప్ప‌టికే తెర మీద‌కు వ‌చ్చాయి. వాట‌న్నింటి విష‌యంలో అధికారులు వివ‌ర‌ణ కోరారు. నిడ‌మ‌ర్రులో సీఆర్డీయే లోక‌ల్ కాంపిటెంట్ అథారిటీ కార్యాల‌యంలో గ‌తంలో విధులు నిర్వ‌ర్తించిన ఒక అధికారిణి ఆ స‌మ‌యంలో అక్క‌డి చెరువులోని కొంత భూమిని త‌మ పిల్ల‌ల‌కు కొనుగోలు చేసి.. పూలింగ్ కు ఇచ్చిన‌ట్లు చూపార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై గ‌తంలో విచార‌ణ జ‌రిపి.. స‌ద‌రు అధికారిణిపై బ‌దిలీ వేటు వేసి వ‌దిలేశారు. తాజాగా ఆయా అంశాల మీద దృష్టి సారించి.. నివేదిక ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

సీఆర్డీయే అధికారులు దృష్టి సారించిన మ‌రిన్ని అంశాల్ని చూస్తే..

+ మందడంలో అసలు భూమే లేని ఒక వ్యక్తి దానిని అమరావతి కోసం పూలింగ్‌ కు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి - బదులుగా రిటర్నబుల్‌ ప్లాట్లను అధికారులు కేటాయించారు. ఇది వెలుగు చూడడంతో విచారణ పేరిట కొన్నాళ్లు హడావిడి చేసి - ఒకరిద్దరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై కేసులు నమోదు చేయించి - చేతులు దులుపుకున్నారు.

+ బోరుపాలెం - మందడం - వెంకటపాలెం తదితర నదీతీర గ్రామాల్లో కొందరు రైతులకు చెందిన మెట్ట భూములను జరీబుగా చూపి - ఎకరాకు 1450 చదరపు గజాల ప్లాట్లను కట్టబెట్టారు. తద్వారా ఎకరాకు 200 చ.గ. చొప్పున అధికంగా ఇచ్చి - ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు.

+ లింగాయపాలెం - రాయపూడి తదితర గ్రామాల్లో అసైన్డ్‌ - లంక భూములకు పూలింగ్‌ ప్యాకేజీ అమలులో వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించలేదు.

+ నేలపాడు - యర్రబాలెం - తుళ్లూరు - రాయపూడి గ్రామాల్లో కొందరు చెరువులు - ప్రభుత్వ భూములను తమవిగా చూపి - పూలింగ్‌ కు ఇస్తే క్షేత్రస్థాయి నిర్ధారణ జరపకుండానే ఎల్పీఎస్‌ ప్యాకేజీలను వర్తింపజేశారు.

+ పలుకుబడి కలిగిన కొందరికి భూములే లేకున్నా - ఉన్నట్లు రికార్డులు సృష్టించి - నాలుగేళ్లుగా భూసమీకరణ ప్రయోజనాలు - ప్లాట్లను కల్పిస్తున్నారు.

+ తుళ్లూరు - వెలగపూడి - నీరుకొండ తదితర గ్రామాలకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులకు చెందిన భూములను పెద్ద విస్తీర్ణంలో గ్రామ కంఠాలుగా గుర్తించి - పూలింగ్‌ నుంచి మినహాయింపునిచ్చిన అధికారులు అసలైన గ్రామకంఠం భూములను మాత్రం అలా గుర్తించలేదు. పలు సమావేశాలు - గ్రామసభల్లో ఎన్నోసార్లు ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ తీసుకున్న చర్యలేమీ లేవు!

+ రాజధాని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి అవినీతి అధికారులుగా పేరుపడిన కొందరికి రిటైర్మెంట్‌ అనంతరం సీఆర్డీయేలోనే ‘పునరావాసం’ కల్పించారు.