Begin typing your search above and press return to search.

జగన్ కీలక సమావేశం

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:46 AM GMT
జగన్ కీలక సమావేశం
X
మంత్రులు పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో బుధవారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి భేటీ అవబోతున్నారు. ఈ భేటీ బాగా కీలకమైనదని పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఎంఎల్ఏలు పనితీరు మదింపు, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న విధానం, మంత్రులు, ఎంఎల్ఏలు ఎంతమంది రెగ్యులర్ గా పాల్గొంటున్నారు అనే విషయాలతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపైన కూడా చర్చ జరిగే అవకాశముందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సింది. వివిధ కారణాల వల్ల రెండుసార్లు వాయిదాపడింది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే జరగాల్సున్నా ఎందుకనో వాయిదాపడింది.

తిరుమల పర్యటన కోసమని మంగళవారం, బుధవారం జగన్ తిరుపతికి వెళుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి నుండి బయలుదేరి నంద్యాల చేరుకుంటారు. అక్కడ నిర్మించిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని జగన్ ప్రారంభిస్తారు. అక్కడినుండి తాడేపల్లికి చేరుకుంటారు.

తాడేపల్లికి చేరుకోగానే ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఇప్పటికే గడపగడప కార్యక్రమం నిర్వహణ, ఎంఎల్ఏల భాగస్వామ్యంపై రెగ్యులర్ గా జగన్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీని ఆధారంగానే బుధవారం సాయంత్రం జరగబోయే సమావేశంలో అందరి పనితీరును సమీక్షిస్తారు.

ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో నిర్ణయాలు తీసుకోవటానికే అని అందరికీ తెలిసిందే. గడపగడపకుప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో పాల్గొనాల్సిందే అని మంత్రులు, ఎంఎల్ఏలకు జగన్ పదే పదే చెబుతున్నారు. పనితీరు సరిగాలేని వారికి టికెట్లిచ్చేది లేదని జగన్ ఇప్పటికే అనేకసార్లు వార్నింగులు కూడా ఇచ్చారు.

అయినా తమ పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్ దక్కేది అనుమానమే. ఏ విషయంలో కూడా జగన్ కు మొహమాటం ఉండదని ఇప్పటికే రుజువైంది. తన ఆదేశాలను పట్టించుకోని వారి విషయంలో జగన్ ఎంత గట్టిగా ఉంటారో అందరికీ తెలిసిందే. కాబట్టి బుధవారం సమావేశం బాగా కీలకమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.