Begin typing your search above and press return to search.

కడప వాసుల కల తీరబోతుంది... ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:09 AM GMT
కడప వాసుల కల తీరబోతుంది... ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ సీఎం జగన్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ తరుణం లోనే కడప జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేయనున్నారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న నినాదం కొన్నేళ్లు గా వినపడుతూనే ఉన్నప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. తాజాగా సీఎం జగన్ చేతుల మీదగా ఆ కల ఇప్పుడు సాకారం కాబోతుంది.

ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ కు నేడు(డిసెంబర్ 23,2019) శంకుస్థాపన జరగనుంది. పాదయాత్ర లో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీ కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం కడప జిల్లా లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సమయంలో , ప్రజల ఆకాంక్ష మేరకు బ్రాహ్మణి స్టీల్స్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు సమీపం లో 10వేల ఎకరాల్లో బ్రాహ్మణి కర్మాగారం పనులు చేపట్టారు. గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు 60శాతం పూర్తయ్యాయి. తరువాత రాజశేఖర రెడ్డి అకాల మరణం.. ఓబుళాపురం మైనింగ్ కేసు లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కావడం తో పనులు పూర్తిగా నిలిచి పోయాయి.

రాష్ట్ర విభజన తరువాత అధికారం లోకి వచ్చిన టీడీపీ , కేంద్రం సహకరించకున్న, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. జమ్మలమడుగు మండలం కంబాల దిన్నె దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 3వేల 400ఎకరాలు సేకరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్.. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కు సిద్ధమయ్యారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఈ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, కడప జిల్లా ల్లో ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షం గా 25వేల మందికి ఉపాధి లభించనుంది ప్రభుత్వం చెబుతోంది.