Begin typing your search above and press return to search.

జగన్ దీక్ష ఎప్పుడు విరమిస్తారు...?

By:  Tupaki Desk   |   11 Oct 2015 11:00 PM IST
జగన్ దీక్ష ఎప్పుడు విరమిస్తారు...?
X
అయిదు రోజుల కిందట వరకు ఏపీలో జగన్ దీక్ష హాట్ టాపిక్... ఆయన దీక్షకు దిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది.... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది... ఆయనకు ఏ స్థాయిలో మద్దతు దొరుకుతుంది... ఇలా రకరకాల చర్చలు జరిగాయి... ఇప్పుడూ రాష్ట్రంలో జగన్ దీక్షే హాట్ టాపిక్... అయితే... చర్చ మాత్రం దాని ప్రభావంపై కాదు. జగన్ దీక్ష ఎప్పుడు విరమిస్తారు. విరమించడానికి ఏం వంక చెబుతారు... స్వయంగా విరమించాల్సి వస్తున్నందుకు ప్రజలకు ఏం చెబుతారు వంటివన్నీ చర్చకొస్తున్నాయి.... అందుకు కారణం ప్రభుత్వం కల్పించిన పరిస్థితులు... జగన్ వేసిన తప్పటడుగులు.

అనుభవజ్ఞుడైన, బలవంతుడైన ప్రత్యర్థిపై యుద్ధం చేసేటప్పుడు వ్యూహాల్లో పదునుండాలి... ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చుకోవాలి... కానీ, చంద్రబాబు వంటి ఉద్ధండుడితో తలపడుతున్న జగన్ తన దీక్ష విషయంలో సరైన ప్లానింగు చేయలేకపోయారు. తొలుత ఆయన దీక్షకు అనుమతి ఇవ్వనప్పుడు మంచి మైలేజే తెచ్చుకున్న జగన్ ఆ తరువాత కూడా 7వ తేదీన దీక్షకు కూర్చునేవరకు టీడీపీ వారు ఆయన్ను విమర్శించారు. దాంతో విమర్శలు, ప్రతివిమర్శలతో జగన్ హైలైట్ అవుతారని అంతా భావించారు.. కానీ, చంద్రబాబు అక్కడే తన రాజకీయ అనుభవాన్ని రంగరించారు. సడెన్ గా జగన్ దీక్షను, ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. మంత్రులు, ఇతర టీడీపీ నాయకులు కూడా జగన్ పై విమర్శలు ఆపేశారు. అంతేకాదు... రాష్ట్రంలో జగన్ దీక్ష చేస్తున్న విషయమే తెలియనట్లుగా ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ జగన్ విషయమే పట్టించుకోవడం లేదు.

ఇంతలోనే అయిదు రోజులు గడిచిపోయాయి... జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను దీక్ష విరమించమని ఎవరూ కోరడం లేదు... అలా అని తనకు తాను విరమిస్తే జనం ముఖాన ఉమ్మేస్తారన్న భయం. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుగా అయింది ఆయన పరిస్థితి.

అసలు ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయమే తప్పన్న వాదన ఆ పార్టీలో వినిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా లేకపోవడం... ప్రత్యేక హోదా తో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం లేక ఆ డిమాండుపై ప్రజలకు పెద్దగా సీరియస్ నెస్ లేకపోవడంతో జగన్ దీక్షకు దిగినా ప్రజలు రోడ్లపైకి వచ్చి మద్దతుగా నిలవలేదు. అంతేకాదు.... అదేసమయంలో ప్రభుత్వం కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం భారీగా నిర్వహిస్తూ ఆ పనుల్లో బిజీగా ఉండి అస్సలు ఖాళీగా లేదు. దీంతో జగన్ పోరాటాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ నేతలు ఇక మనమే విరమింపజేద్దామని నిర్ణయించినట్లు సమాచారం. లేదంటే జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కొందరిని తెచ్చి జగన్ ను బుజ్జగింపజేసేలా డ్రామా ఆడి... పార్లమెంటులో జగన్ కు మద్దతుగా పోరాడుతామని వారితో చెప్పించి జగన్ తో దీక్ష విరమింపజేసే అవకాశముంది.