Begin typing your search above and press return to search.

ఆ రెండు ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీలో చర్చలు!

By:  Tupaki Desk   |   12 March 2019 5:32 AM GMT
ఆ రెండు ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీలో చర్చలు!
X
కర్నూలు ఎంపీ టికెట్ - అనంతపురం ఎంపీ టికెట్.. ఈ రెండు నియోజకవర్గాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నాయని సమాచారం. ఈ రెండు సీట్ల విషయంలో అభ్యర్థిత్వాల గురించి జగన్ చర్చలు జరుపుతూ ఉన్నారని.. ఈ రోజు వీటి కథ కూడా తేలిపోతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

ముందుగా అనంతపురం ఎంపీ సీటుకు తలారి రంగయ్యను అనుకున్నారు. ఆయన పోటీ చేయడానికి ఇప్పుడు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. అయితే అటు వైపు నుంచి జేపీ పవన్ కు టికెట్ ఖరారు అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో జేసీ వర్గాన్ని ఢీ కొనేందుకు రంగయ్య సరైన అభ్యర్థి అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అనంత వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా నిలబడితే పోటీ ధీటుగా ఉంటుందని.. పవన్ లాంటి కుర్ర రాజకీయ నేతతో అనంత పోటీ పడితే.. జనం వెంకట్రామిరెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ అంశం గురించి జగన్ ఏం తేలుస్తారో చూడాల్సి ఉంది. అలాగే కర్నూలు ఎంపీ టికెట్ విషయంలో కూడా వైసీపీ లో చర్చలు సాగుతూ ఉన్నాయని సమాచారం. ఈ సీటును బీసీలకు ఖరారు చేసిన జగన్.. ఎవరిని ఎంచుకుంటారనేది చర్చగా మారింది. ఇక్కడ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ. ఇలాంటి నేపథ్యంలో ఆయనను ఢీ కొట్టే తగిన బీసీ అభ్యర్థి వేటలో ఉన్నారట జగన్.

రామయ్యను అభ్యర్థిగా అనుకున్నా.. ఆయన తగరని అనుకుంటున్నారు. అందుకే ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఒక బీసీ డాక్టర్ పేరును జగన్ పరిశీలిస్తూ ఉన్నారట. దాదాపుగా ఆయనకే టికెట్ ఖరారు అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి ప్రతిష్టంభన నెలకొన్న కీలక నియోజకవర్గాలు ఇవే అని.. వీటిపై జగన్ ఈ రోజు - రేపట్లో తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలు అధికారికంగా ఈ రోజే ఖరారు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం లేదా - రేపు వైసీపీ అధికారిక జాబితా వెలువడే అవకాశం ఉందని సమాచారం.