Begin typing your search above and press return to search.

బాబును తెలివిగా ఇరికిస్తున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   30 April 2016 7:02 AM GMT
బాబును తెలివిగా ఇరికిస్తున్న జ‌గ‌న్‌
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో ఎమ్మెల్యేల‌ను లాక్కోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న వైఎ స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీని - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును కొత్తర‌కంగా ఇరకాటంలో ప‌డేశార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏ హామీ ఆధారంగా అయితే త‌మ ఎమ్మెల్యేల‌ను పార్టీ పిరాయింప‌చేస్తున్నారో...అదే హామీ ఆధారంగా బాబును ఇబ్బందిపెట్టేందుకు జ‌గ‌న్ వేసిన స్కెచ్ వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్లుంద‌ని చెప్తున్నారు.

సేవ్ డెమోక్రసీ పేరుతో హస్తినకు వెళ్లి వచ్చిన జగన్ అసలు ఉద్దేశం అసెంబ్లీ స్థానాల పెంపును అడ్డుకోవడమేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదనను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అందుకే అసెంబ్లీ స్థానాల ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర మంత్రులను ఆ పార్టీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి కోరారని టీడీపీ శ్రేణులు స్ప‌ష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదన వల్లే ఇప్పటికే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు టీడీపీలో చేరారని భావిస్తోన్న వైసీపీపీ నాయకత్వం - అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదనను అడ్డుకోగలిగితే, ఎమ్మెల్యేల వలసలను నిలువరించడం సులువవుతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీలో చేరిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక దేశం నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అందరికి అవకాశాలు లభిస్తాయని టీడీపీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బుజ్జగిస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేరికను పార్టీ సీనియర్ నేత కరణం బలరాం - పరవాడలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయిన గండిబాబ్జీ చేరికను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరిద్దర్ని పిలిచి వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని, అందరికి ఏదో ఒక చోట సర్దుబాబు చేసే వెసులుబాటు ఉంటుందని, అసెంబ్లీ టికెట్ల గురించి ఆందోళన చెందవద్దని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు కుదరన్నది నిర్వివాదాంశం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు అసెంబ్లీ స్థానాల పెంపుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. పునర్విభజనచట్టంలో ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ నియోజకవర్గానికి రెండేసి అసెంబ్లీ స్థానాల సంఖ్యను చొప్పున పెంచాలని కోరుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాల పెంచాలని కోరుతుండడం, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ అమలు మేరకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసైనా సరే, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేందుకు కేంద్రం సైతం సుముఖంగా ఉండడం వైస్సార్సీపీ నాయకత్వానికి సుతారం మింగుడుపడడం లేదు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స్థానాలు పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రమంత్రులను, పెంపు బిల్లును పార్లమెంట్‌ లో అడ్డుకునేందుకు కృషి చేయాలని విపక్ష నేతలను కోరారంటున్నారు.