Begin typing your search above and press return to search.

ముందస్తు మూడ్ : హ్యాండ్ ఇచ్చేస్తున్న జగన్...?

By:  Tupaki Desk   |   9 Jun 2022 1:30 PM GMT
ముందస్తు మూడ్ : హ్యాండ్ ఇచ్చేస్తున్న జగన్...?
X
ఏపీలో రాజకీయం వేడెక్కడానికి జగన్ ఈ మధ్య కాలంలో అనుసరించిన రాజకీయ విధానమే కారణం అని చెప్పాలి. విపక్షాలు ఎపుడూ త్వరగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటాయి. ఆ మాటకు వస్తే ఏపీలో జగన్ సీఎం అయిన నెల రోజుల నుంచే ఏపీలో పొలిటికల్ హీట్ ని టీడీపీ రాజేసింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా జగన్ సీఎం అయిన నాలుగు నెలల తేడాలోనే విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి తొడకొట్టారు.

ఇపుడు చూస్తే వైసీపీ పాలన మూడేళ్ళు పూర్తి అయ్యాయి. దాంతో మిగిలినది రెండేళ్ళు కాబట్టి సహజంగా కొంత వేడి వాతావరణం ఉంటుంది. కానీ దాన్ని ఇంకాస్తా పెంచుతూ జగన్ ఈ మధ్య తరచూ విపక్షాల మీద విమర్శల జోరు చేశారు. ఎక్కడ సభలో ఆయన మాట్లాడినా విపక్షాల తీరుని తప్పుపట్టడమే కాకుండా వారిని సవాల్ చేసే విధంగా భారీ డైలాగులు పేల్చుతూ వచ్చారు.

మరీ ముఖ్యంగా చంద్రబాబు తీరుని ఎండగడుతూ జగన్ ఈ మధ్యకాలంలో చేసిన కామెంట్స్ ఎన్నికల వాతావరణాన్ని ఏపీలో తెచ్చాయి. అంతే కాదు ఏపీలో ముందస్తు అనుమానాలను పెంచినదీ కూడా జగన్ దూకుడుగా అనుసరించిన పోకడలే అంటారు. ఏపీలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం, సామాజిక సమరభేరీ పేరిట బస్సు యాత్ర చేపట్టడం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం వంటివి చేయడం ద్వారా ఏపీలో తొందరలో ఎన్నికలు వస్తాయన్న ఆలోచనలను రేకెత్తించారు.

అంతే కాదు ఈ మధ్య వరసగా పార్టీ సమావేశాలను నిర్వహించి ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని, లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం ద్వారా జగన్ ఎన్నికల మూడ్ తెచ్చేశారు. అయితే జగన్ తాజాగా నిర్వహించిన వర్క్ షాప్ లో మాత్రం ముందస్తు మీద పెద్దగా ఏమీ సంకేతాలు ఇవ్వకుండానే ముగించడం మీద చర్చ సాగుతోంది.

ఈ వర్క్ షాప్ లో జగన్ మాట్లాడింది ఏంటి అంటే గడప గడపకూ కార్యక్రమం మరో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు సాగుతుందని. అంటే టోటల్ గా ఈ ఏడాది పూర్తి అయ్యేవరకూ ఎమ్మెల్యేలు జనాల్లోనే ఉంటారు అన్న మాట. ఇక 2023 వచ్చాక ఎటూ బడ్జెట్ సమావేశాలు హడావుడి ఉంటాయి. ఆ మీదట మిగిలేది ఒక ఏడాది మాత్రమే. అప్పటికి జనాల పల్స్ పూర్తిగా తెలిసిపోతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంటే ఆ ఏడాది ని కూడా హ్యాపీగా వాడుకుంటారు.

ఒకవేళ రామని ఎక్కడైనా తేడా కొడుతోంది అన్న చర్చ కనుక వస్తే ఉన్న ఏడాదిని ఎంజాయ్ చేసి డైరెక్ట్ గా 2024 ఎన్నికలను ఫేస్ చేస్తారు. ఎలా చూసుకున్నా ముందస్తునకు ఇక మీదట తావు లేదనే అంటున్నారు. జగన్ మనసు ఇలా మారడానికి ఈ మధ్య చేసిన ఢిల్లీ టూరే కారణం అని అంటున్నారు.

ఆయన ఢిల్లీ టూర్ సందర్భంగా బీజేపీ పెద్దలతో మాట్లాడినపుడు ముందస్తు ఎన్నికల ప్రస్థావన తెచ్చారు అంటున్నారు. అయితే దానికి వారు వద్దని వారించినట్లుగా చెబుతున్నారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం నడుపుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అది తప్పుడు సంకేతం ఇస్తుందని వారించినట్లుగా చెబుతున్నారు.

దాంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అంటున్నారు. ఇక గడప గడపకూ మన ప్రభుత్వం అయినా మంత్రుల బస్సు యాత్ర అయినా కూడా ప్రజల నుంచి అసంతృప్తి బాగా ఉందని గ్రహించడం వల్ల కూడా ముందస్తు ప్రతిపాదనలు అటకెక్కాయని మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే మరో రెండేళ్ళ పాటు పూర్తిగా అధికారాన్ని జగన్ సర్కార్ అనుభవించడానికే ఫిక్స్ అయింది.

ఈ విధంగా చూస్తే ఎపుడైనా ఎన్నికలు వస్తాయని ఆశపడుతున్న చంద్రబాబుకు ఇది చేదువార్తే. ఆయనకు ఎంత వేగంగా ఎన్నికలు వస్తే అంత లాభం. ఆయన వయసు ఇపుడు 73 ఏళ్ళు, ఈ టైమ్ లో ఎన్నికలు వస్తే ఆయన దూకుడు వేరుగా ఉంటుంది. అదే మరో రెండేళ్ళు అంటే 75వ పడిలోకి బాబు వస్తారు. మరి అప్పటి ఓపిక గురించి కూడా ఆలోచించాలి. ఇక ఇపుడిపుడే పార్టీ అంతా కదులుతోంది. ముందస్తు లేకపోతే అంతా మరోసారి పడకేస్తారు. ఇది కూడా బాబుకు పట్టుకునే అతి కీలకమైన బాధ.

అయితే ముందస్తు ఎన్నికలు లేకపోతే జనసేనకు కూడా మంచిదే. పవన్ 2024 టార్గెట్ గా చేసుకుని ఒక వైపు సినిమాలు చేస్తున్నారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగడమే ఆయనకు కావాలని అంటున్నారు. ఇక బీజేపీకి కూడా అసెంబ్లీకి పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు కావాలి. అయినా సరే ఎపుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమని జనసేన టీడీపీ బీజేపీ చెబుతున్నాయి. ఇపుడు అంతా ఉస్సూరుమనే విధంగా జగన్ మనసు మార్చుకున్నారు అంటున్నారు.