Begin typing your search above and press return to search.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో టెక్నాల‌జీ

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:00 AM GMT
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో టెక్నాల‌జీ
X
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పాదయాత్రకు జనం నుంచి మంచి ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆదరణ తగ్గకుండా ఉండేలా - మరింత పెరిగేలా... జగన్ విజన్ - అధికారంలోకి వస్తే చేయబోయే పనులు... ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగించిన ప్రజాసంక్షేమ పాలన విశేషాలను ప్రజలకు చేరువ చేయడానికి ఆ పార్టీ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో దూసుకెళ్తోంది.

ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేపట్టిన పాదయాత్ర జోరును అలాగే జనంలోకి చొప్పించేందుకు గాను వైసీపీ టెక్నికల్ టీం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. పాదయాత్ర వెంబడి ఉన్న ఏవీ వ్యాన్లు(ఆడియో విజువల్ వ్యాన్) నిరంతరాయంగా పాటలను వినిపిస్తూ వీడియోలను ప్లే చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాయి. మొత్తం అయిదు వ్యాన్లు పాదయాత్రలో ఉంటున్నాయి. జగన్ అనుకూల పాటలు.. ఆయన విజన్ తెలిపే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పాటలను అవి వినిపిస్తున్నాయి.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలనూ ప్రజలకు గుర్తు చేస్తున్నాయి.

మరోవైపు ప్రతి 500 కిలోమీటర్లకూ పాదయాత్ర ప్రచార ప్రణాళిక మారుతోంది. యాత్ర పొడవునా సుమారు 1000 ఫ్లెక్సీలు ఉంటున్నాయి. రోజుకు వెయ్యి స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నారు. రోజుకు 5 వేల క్యాలండర్లు పంపిణీ చేస్తున్నారు.

ప్రస్తుతం 500 కిలోమీటర్లు దాటేసిన పాదయాత్ర ఇప్పుడు అనంతపురంలో సాగుతోంది. ఈ యాత్రలో ముందు ఒక ఏవీ వ్యాన్ ఉంటోంది. మరో నాలుగు వ్యాన్లు పాదయాత్ర సాగే గ్రామాలకు యాత్రకంటే ముందుగానే చేరుకుంటున్నాయి. వీటికి రెండు వైపులా ఎల్‌ ఈడీ స్క్రీన్లు ఉంటున్నాయి. వీటిలో రాజశేఖరరెడ్డి - జగన్ కు సంబంధించిన వీడియోలు ప్లే చేస్తున్నారు.

దీంతో పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట ఓపెన్ చేసిన సోషల్ మీడియా పేజీలు.. జగన్ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. అంతేకాదు.. యాత్రకు వ్యతిరేకంగా - జగన్ కు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీలు - నాయకులు - వారి అనుచరులు - సోషల్ గ్రూపులు సాగించే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా భారీ సోషల్ సైన్యమే ఉంది. మొత్తానికి జగన్ స్పీడుకు టెక్నాలజీ స్పీడు కూడా తోడవుతుండడంతో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. జనానికి రీచవుతోంది. దీంతో జగన్ పాదయాత్రను చూసి టీడీపీ నేతల్లో కలవరం మొదలైందట.