Begin typing your search above and press return to search.

పోల‌వ‌రానికి వెళ్లిన జ‌గ‌న్‌.. సీఎం కొచ్చిన సందేహాలేంటి?

By:  Tupaki Desk   |   20 Jun 2019 9:57 AM GMT
పోల‌వ‌రానికి వెళ్లిన జ‌గ‌న్‌.. సీఎం కొచ్చిన సందేహాలేంటి?
X
ఏపీకి వ‌ర‌దాయ‌నిగా చెప్పే పోల‌వ‌రం ప్రాజెక్టును ఈ రోజు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంద‌ర్శించారు. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి ఆయ‌న ప్ర‌త్యేక హోలికాఫ్ట‌ర్ లో పోల‌వ‌రానికి చేరుకున్నారు. మూడుసార్లు హెలికాఫ్ట‌ర్ నుంచి ప్రాజెక్టును ప‌రిశీలించారు.

అనంత‌రం ప్రాజెక్టు ఎగువ‌.. దిగువ ప్రాంతాన్ని.. కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. వ్యూ పాయింట్ కు చేరుకొని ప్రాజెక్టును ప‌రిశీలించి.. ప‌నికి సంబంధించిన వివ‌రాల్ని అడిగి తెలుసుకున్నారు. పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌న వెంట ఈఎన్ సీ వెంక‌టేశ్వ‌ర‌రావు.. జ‌ల‌వ‌న‌రుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్.. రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్.. పిల్లి సుభాష్ చంద్ర‌బాబోస్.. పి. విశ్వ‌రూప్ తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

వాస్త‌వానికి పోల‌వ‌రం ప్రాజెక్టుకు ప్ర‌తిప‌క్ష నేత‌గా రెండుసార్లు వ‌చ్చారు. 2011 ఫిబ్ర‌వ‌రి 7న రావుల‌పాలెం నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ర‌కూ హ‌రిత యాత్ర పేరుతో 70 కిలోమీట‌ర్లు మేర పాద‌యాత్ర చేశారు. ఈ ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టాల‌ని కోరుతూ ఆయ‌నీ యాత్ర చేశారు.

త‌ర్వాత త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. సీఎం హోదాలో తొలిసారి వ‌చ్చిన ఆయ‌న‌.. పోల‌వ‌రానికి మాత్రం మూడోసారి వ‌చ్చిన‌ట్లుగా చెప్పాలి. ప్రాజెక్టును ప‌రిశీలించిన ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌ల‌ను అధికారుల‌కు సంధించారు. ఎగువ కాఫ‌ర్ డ్యామ్ ప‌నులు ఎంత‌వ‌ర‌కు పూర్తి అయ్యాయి? భారీగా వ‌ర‌ద వ‌స్తే ప‌రిస్థితి ఏమిటి? భారీగా వ‌ర‌ద వ‌స్తే కాఫ‌ర్ డ్యామ్ కొట్టుకుపోకుండా తీసుకున్న ర‌క్ష‌ణ చ‌ర్య‌లు ఏమిటి? గోదావ‌రిలో వ‌ర‌ద వ‌స్తుంద‌ని తెలిసి సీజ‌న్ ముగిశాక ప‌నులు ఎలా చేప‌ట్టారు? కాఫ‌ర్ డ్యాం కార‌ణంగా నీరు స్పిల్ వేపైకి వ‌చ్చి నిర్మాణాల‌కు ఆటంకాలు క‌లిగితే ఏం చేస్తారు? లాంటి ప‌లు ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న అడిగారు.

షెడ్యూల్ ప్ర‌కారం ప‌నులు పూర్తి కాక‌పోవ‌టానికి కార‌ణం ఏమిటి? ఏ అంశాలు ప‌నులు పూర్తి కాకుండా అడ్డుకున్న విష‌యాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. సీఎం జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికారులు స‌మాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టు మీద జ‌గ‌న్ కు ఉన్న అవ‌గాహ‌న‌.. ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌ల్ని చూసిన అధికారులు ప్రాజెక్టు మీద జ‌గ‌న్ కు మంచి ప‌ట్టు ఉంద‌న్న అభిప్రాయానికి రావ‌టం గ‌మ‌నార్హం.