Begin typing your search above and press return to search.

జగన్ గురివింద నీతి.. బాబాయ్ హత్య ఎపిసోడ్ పై ఇప్పుడేమంటారు?

By:  Tupaki Desk   |   2 Dec 2022 4:26 AM GMT
జగన్ గురివింద నీతి.. బాబాయ్ హత్య ఎపిసోడ్ పై ఇప్పుడేమంటారు?
X
చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ.. ఏం లాభం? సొంత బాబాయ్ ను ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా.. పాశవికంగా హతమార్చిన ఉదంతానికి సంబంధించిన న్యాయ విచారణ తాను పాలిస్తున్న ఏపీలో కాకుండా పక్క రాష్ట్రానికి విచారణకు బదిలీ చేయటం దేనికి సంకేతం. నోరు విప్పితే మాటలు కోటలు దాటించే జగన్.. మిగిలిన ఏ విషయంలో అయినా మాటలు చెప్పగలరేమో కానీ.. బాబాయ్ హత్య ఎపిసోడ్ మీద ఆయనేం చెప్పినా అతికినట్లుగా ఉండదన్నది మాత్రం నిజం.

సొంత బాబాయ్ హత్య కేసు తన ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నిజాయితీగా జరగటం లేదని.. దర్యాప్తునకు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి దేశ అత్యున్నత న్యాయస్థానం బదిలీ చేయటంపైన ఆయన ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చినా ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇంతకు మించిన అవమానం.. ఇంతకు మించిన సిగ్గుచేటు వ్యవహారం మరొకటి ఉండదనే చెప్పాలి.

రాష్ట్రంలోని కోట్లాది మంది మాన.. ప్రాణ ఆస్తులకు రక్షణగా ఉంటానని జగన్ నోటి నుంచి వచ్చే మాటలు ఇకపై నవ్వులాటగా మారటం ఖాయమంటున్నారు. సొంత బాబాయ్ దారుణ హత్య మీద విచారణనే సరిగా జరిపించే విషయంలో ఫెయిల్ అయిన జగన్.. మిగిలిన వారి గురించి ఇంకేం పట్టించుకుంటారన్న మాట ఆయన్ను వెంటాడటం ఖాయం. ఆయనరాజకీయ కెరీర్ మొత్తంలో బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం ఒక మచ్చలా మారటం ఖాయమని చెప్పక తప్పదు.

బాబాయ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏపీలోని పరిస్థితుల గురించి అత్యున్నత న్యాయస్థానం వెలుబుచ్చిన అభిప్రాయాలు జగన్ పాలనపై కొత్త సందేహాల్ని కలిగించేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితి రావటం బ్యాడ్ లక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజా ఆదేశాలతో.. ఏపీలో ఆరాచక పాలన సాగుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.

నిజానికి సొంత బాబాయ్ దారుణంగా హత్య చేసినప్పుడు.. తానే సీఎంగా ఉన్న వేళలో.. విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ..అదేమీ లేకుండా.. చివరకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని కోరటం.. నిష్పక్షపాతంగా విచారణ జరగటం లేదన్న జగన్ సోదరి సందేహాలు జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయని చెప్పాలి. నిజానికి ఒక ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి విచారణకు మారుస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి ఉండేవారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అయినా.. సీఎం జగన్ కు ఇలాంటి ఆలోచనలు మనసులోకి వస్తాయా? అసలు ఆ ఫీలింగ్స్ ఆయనలో ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఆయన చెబితేనే బాగుంటుంది. కాదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.