Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ లోకేష్

By:  Tupaki Desk   |   19 Sep 2015 5:29 AM GMT
జగన్ వర్సెస్ లోకేష్
X
ఏపీలో యువనేతల మధ్య రాజకీయ పోరు మొదలైంది... చంద్రబాబు ప్రభుత్వంపై ఇంతెత్తున లేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ పై ప్రభుత్వం తరుఫున మంత్రులు, ఇతర నాయకులు సమాధానాలిస్తున్నా వారికి తోడుగా లోకేశ్ కూడా ఘాటుగానే రెస్పాండవుతున్నారు. జగన్ కూడా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైసీపీ నేతలు కూడా లోకేశ్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జగన్ - లోకేశ్ ల మధ్య సమరం తారస్థాయికి చేరుతున్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్ నేతల ప్రస్తుత పోరుగా రాజకీయవర్గాలు దీన్ని అభివర్ణిస్తున్నాయి.

నిత్యం టీడీపీ ప్రభుత్వంపై మండిపడుతున్న వైకాపా అధినేత జగన్‌ కు ట్విటర్‌ లో నారా లోకేష్ ధీటైన సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించిన ఘనత జగన్‌కే దక్కిందని లోకేష్ బహిరంగంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ ప్రకంపనలకు తెరతీశారు.. హెరిటేజ్‌ పై జగన్ చేసిన వ్యాఖ్యలపైనా లోకేశ్ ధీటుగానే ప్రతిస్పందించారు. కాగా తాజాగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాల్సిన జగన్ ఎపి రాజధాని అమరావతికి ఏమాత్రం సహకరించవద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశారంటూ లోకేష్ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నాడని, రాజ ధానికి సంబంధించిన భూముల విషయంలో సైతం జగన్ తనదైన శైలిలో వ్యవహరించాడని లోకేష్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలోనూ భూములు ఇవ్వ కుండా రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని జగన్ పై లోకేశ్ విమర్శలు కురిపించారు. భోగాపురం విమా నాశ్రయం, బందరుపోర్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారంటూ జగన్ పై ఆరోపణలు చేశారు.

అయితే... జగన్ వైపు నుంచీ లోకేశ్ లక్ష్యంగా దాడి పెరిగింది. లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ఒక్కోసారి మాత్రం ఆయన లోకేశ్ ది తన స్థాయి కాదన్నట్లుగా పట్టించుకోవడం లేదు కూడా. తాను విమర్శిస్తే చంద్రబాబునో లేదంటే సీనియర్ మంత్రులనో విమర్శించాలి తప్ప లోకేశ్ వంటివారిని కాదని జగన్ వైసీపీ నేతల వద్ద పలుమార్లు అన్నట్లు సమాచారం. అయితే... ఇటీవల ఆయన లోకేశ్ సంగతి మీరు చూసుకోండి అంటూ పార్టీలో ఒకరిద్దరికి ప్రత్యేకంగా లోకేశ్ ను టార్గెట్ చేసే బాధ్యత అప్పగించినట్లు సమాచారం. అందులో భాగంగానే తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబరి రాంబాబు లోకేశ్ పై ఆరోపణలు చేశారు. లోకేశ్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ అందుకు సంబంధించిన పలు చిత్రాలను కూడా విడుదల చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరినట్టుగానే కనిపిస్తోంది.