Begin typing your search above and press return to search.

30 ఏళ్లు పాలించాలని ఉంది..

By:  Tupaki Desk   |   9 July 2017 12:45 PM GMT
30 ఏళ్లు పాలించాలని ఉంది..
X
వైసీపీ ప్లీనరీ వేదికగా జగన్ తన మనసులోని మాటను పార్టీ శ్రేణులతో - ప్రజలతో పంచుకున్నారు. తనకు సీఎం కావాలని ఉందని... 30 ఏళ్ల పాటు ప్రజలకు తన పాలన అందించాలని ఉందని జగన్ సభా ముఖంగా ప్రకటించారు. జగన్ ఆ మాట అనగానే సభాప్రాంగణంలో చప్పట్ల వర్షం కురిసింది.

2014లో చంద్రబాబులాగా తాను అబద్ధాలాడి ఉంటే, ముఖ్యమంత్రిని అయ్యేవాడినేమోనని.. కానీ, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం తనకు లేదని, అందుకే, ఓట్ల కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. భవిష్యత్ తమదేనని - అధికారంలోకి రావడం ఖాయమని, అంతిమంగా గెలిచేది న్యాయమేనని, తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తానని, తొమ్మిది కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.

చంద్రబాబు పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని, వారికి గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, ఆయన పాలనలో కరవు - అకాల వర్షాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ భరోసా కింద రైతులను ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అందరికీ రూ.50 వేలు ఇస్తామని, ఈ మొత్తాన్నిప్రతి ఏటా నాలుగు విడతల్లో రూ. 12,500 మే నెలలో యిస్తామని చెప్పారు. ఈ మొత్తాన్నినేరుగా రైతుల చేతికే యిస్తామని, ఏ పంట వేయాలన్నది వారికే వదిలేస్తామని చెప్పారు. వైఎస్సార్ భరోసా కింద ప్రతి రైతుకు ఈ సాయం అందజేస్తామన్నారు. దీని ద్వారా 86 శాతం మంది రైతులు అంటే 66 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, మొత్తం రూ.33 వేల కోట్లు ప్రభుత్వం తరపున చెల్లించేలా చేస్తామని, రైతును మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలకు కల్పిస్తామని, రూ.2 వేల కోట్లతో కెలమిటీ ఫండ్ ఇస్తామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా, పొదుపు సంఘలకు ‘వైఎస్సార్ ఆసరా’ అనే పథకాన్ని తీసుకొస్తామని, సున్న వడ్డీకు రుణాలిస్తామన్నారు.