Begin typing your search above and press return to search.

జగన్ ఎంత తిడితే కేసీఆర్ కు అంత లాభమా..?

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:12 AM GMT
జగన్ ఎంత తిడితే కేసీఆర్ కు అంత లాభమా..?
X
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కింది. ఇప్పటివరకూ టీఆర్ ఎస్.. తెలుగుదేశం.. బీజేపీలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రచారం మొదటి నుంచి వరంగల్ లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కదాన్లో ఒక్కో మంత్రికి బాధ్యత అప్పగించటం తెలిసిందే. ఇలా ఏడుగురు మంత్రులు ఉప ఎన్నిక విషయంలో దృష్టి సారించి.. అధినేత తమకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సోమవారం నుంచి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒక కొత్తదనం కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ ప్రచారంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలో ఉనికి ఏమాత్రం లేని తమ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని నిలబెట్టటమే కాదు.. ఎన్నికల ప్రచారానికి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. జగన్ పార్టీకి వరంగల్ లో ఉన్న బలం ఏపాటిదో తెలిసిందే. గెలుపు మీద ఏ మాత్రం ధీమా లేకున్నా.. జగన్ ఏకంగా మూడు రోజులు ప్రచారం చేయటం ఆసక్తిని రేకెత్తించింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఎంత తీవ్రంగా విరుచుకుపడ్డారంటే.. కేసీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు.

ఏపీకి సంబంధించి తెలంగాణ అధికారపక్షం కారణంగా నష్టం జరిగినప్పుడు కూడా చేయని రీతిలో.. తాజా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ను దుమ్మెత్తిపోయటం గమనార్హం. కేసీఆర్ పాలనను చేతకాని పాలనగా అభివర్ణించటంతో పాటు.. టీఆర్ఎస్ అభ్యర్థిని కానీ గెలిపిస్తే తెలంగాణలోని చేతకాని పాలనను గెలిపించినట్లేనని వ్యాఖ్యానించటం విశేషం. అంతేకాదు.. కేసీఆర్ మోజుపడిన వ్యక్తిని మంత్రివర్గంలో ఉంచేందుకే ఆయనీ ఉప ఎన్నికను తీసుకొచ్చిన విషయాన్ని మర్చిపోకూడదంటూ మండిపడ్డారు. కేసీఆర్ మోజు తీర్చుకోవటం కోసం ఈ ఉప ఎన్నికలను తీసుకొచ్చినందుకు సిగ్గుపడుతున్నామంటూ ఓటర్లు తమ తీరపుతో చెప్పాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పల్లెత్తు మాట అనని జగన్.. ఇప్పుడు ఏకంగా ఇంతేసి మాటలు అనటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయన్న విషయంలోనూ ఇంత తీవ్రంగా మాట్లాడని వ్యక్తి ఉప ఎన్నికల ప్రచారంలో ఇన్నేసి మాటలు అనటం ఏమిటన్నది ఇప్పుడో చర్చగా మారింది. జగన్ విమర్శల్ని కాస్తంత లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర కోణం కనిపిస్తుంది.

ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్ని చూస్తే.. నితీశ్ నేతృత్వంలోని లౌకిక మహాకూటమి అద్భుతమైన విజయం సాధించటానికి అసలు కారణం.. బీజేపీ గెలిచేందుకు ఉన్న దారుల్ని మూసేయటం. విపక్షాలు తమకున్న ఓటు బ్యాంకును ఒక కూటమిగా మార్చి పోటీ చేస్తే.. ఓట్లు చీలకుండా బీజేపీ దూకుడు బ్రేకులు వేయొచ్చని వ్యూహం పన్నాయి. అందుకు తగ్గట్లే.. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ లాంటి బలమైన నేతలు ఒక కూటమిగా ఎన్నికల బరిలో దిగారు. అందరూ అనుకున్నట్లే ఈ కూటమి కారణంగా ఓట్లు చీలకుండా నితీశ్ కూటమి అద్భుత విజయాన్ని సాధిచంటానికి సాయంగా మారింది.

సరిగ్గా ఇదే వ్యూహాన్ని రివర్స్ గేర్ లో వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం అమలు చూస్తున్నట్లు కనిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో బలమైన పార్టీ ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ అధికారపక్షమేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్.. ఎన్డీయే అభ్యర్థులు బరిలో ఉన్నా.. వారి ప్రభావం అంతంతమాత్రమేనన్న విషయం మర్చిపోకూడదు. వీరంతా తెలంగాణ అధికారపక్ష అభ్యర్థికి చెక్ చెప్పి విజయం సాధించేంత బలం ఉన్న వారు కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అదే సమయంలో తెలంగాణలో ఏ మాత్రం బలంగా లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల బరిలో దిగటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. దీని వెనుక వ్యూహమే ఉందన్న మాట వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఉప ఎన్నికల బరిలోకి దిగటం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సమిష్టిగా ఉండకుండా.. చీలిపోయే అవకాశాన్ని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. బలమైన అధికారపక్షానికి ధీటుగా శక్తివంతమైన అభ్యర్థిని బరిలోకి దింపటంలో విఫలమైన విపక్ష పార్టీలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటంలో విఫలమయ్యారు.

తాజాగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగటం ఒక ఎత్తు అయితే.. సదరు అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన జగన్.. కేసీఆర్ సర్కారు వ్యతిరేకంగా ఘాటైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓటు చీలిపోవటం ఖాయం. అదే జరిగితే.. తెలంగాణ అధికారపక్షానికి లబ్థి చేకూరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా జగన్ చేసే వ్యాఖ్యలన్నీ కూడా టీఆర్ ఎస్ గెలుపునకు సాయం చేస్తాయన్న అభిప్రాయం నెలకొంది. తెలంగాణ అధికారపక్ష వ్యతిరేక ఓటును ఇప్పటి వరకూ తెలుగుదేశం.. బీజేపీ ఉమ్మడి అభ్యర్థితో పాటు.. కాంగ్రెస్ అభ్యర్థితో పాటు.. తాజాగా జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలికలు పీలికలు కావటం ఖాయం. అదే జరిగితే.. టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడక లాంటిదనే చెప్పాలి. అందుకే.. కేసీఆర్ ను జగన్ ఎంతగా తిడితే.. అంత లాభమన్న మాట. ఎప్పుడూ తిట్టని జగన్.. కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నది అందుకేనా..?