Begin typing your search above and press return to search.

బాబూ.. నువ్వూ ఉండవు... నీకు హోదా ఉండదు

By:  Tupaki Desk   |   13 Jun 2019 9:16 AM GMT
బాబూ.. నువ్వూ ఉండవు... నీకు హోదా ఉండదు
X
ఏపీ అసెంబ్లీ తొలి సెషనే వేడి పుట్టిస్తోంది. స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికైన వేళ ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ సందర్భంగా అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా సీఎం జగన్ తొలి ప్రసంగంలోనే చంద్రబాబును టార్గెట్ చేసి గడిచిన ప్రభుత్వంలో ఆయన చేసిన తీరును ఎండగట్టారు..

జగన్ మాట్లాడుతూ గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో సభ ఎలా ఉండకూడదో చూశామని.. అధికార పార్టీగా చంద్రబాబు మా 23మంది ఎమ్మెల్యేలను లాగేశారని.. ఆయన ప్రోద్బలంతో నాటి స్పీకర్ కోడెల మౌనసాక్షిగా అక్రమాలకు వత్తాసు పలికాడని జగన్ దుయ్యబట్టారు. అసెంబ్లీ మొదలు కాకముందు మా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఐదుగురిని లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని అన్నారని.. కానీ దాన్ని తాను తిరస్కరించానని జగన్ చెప్పుకొచ్చారు. అలా చేస్తే నాకు బాబుకు తేడా ఏముంటుందని జగన్ అన్నారు. చంద్రబాబులా తాను ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించనని స్పష్టం చేశారు.

ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని.. తాను తలుపులు తెరిస్తే టీడీపీ దుకాణం బంద్ అవుతుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబూ నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయమంటావా అంటూ ఎద్దేవా చేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా - ప్రజలు - దేవుడు స్పష్టమైన తీర్పు నిచ్చారని జగన్ చెప్పుకొచ్చారు. తమ 23 మంది ఎమ్మెల్యేలను లాగిన చంద్రబాబుకు అదే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చాడని.. ముగ్గురు ఎంపీలను లాగితే అదే ముగ్గురిని గెలిపించాడని జగన్ చెప్పుకొచ్చారు. కానీ తాను చంద్రబాబులా చేయనని.. ఏ టీడీపీ నేత మా పార్టీలో చేరుదామనుకుంటే వారు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఒకవేళ తాను టీడీపీ ఎమ్మెల్యేను చేర్చుకుంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని జగన్ స్పీకర్ తమ్మినేనిని కోరారు.

గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా కుదేలయ్యాయో చూశామని.. అసెంబ్లీని ఎంత దారుణంగా నడిపామో చూశామని.. కానీ జగన్ ప్రభుత్వంలో ఎంత ఆదర్శంగా నడుపుతామో చూడాలని జగన్ చెప్పుకొచ్చారు.