Begin typing your search above and press return to search.

నై జ‌గ‌న్ : సంక్షేమం హ‌క్కు..మ‌రి ! అభివృద్ధి ? తెలుసుకో నేర్చుకో

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 AM GMT
నై జ‌గ‌న్ : సంక్షేమం హ‌క్కు..మ‌రి ! అభివృద్ధి ? తెలుసుకో నేర్చుకో
X
రెండంటే రెండు వాద‌న‌లు వినిపిస్తున్నాయి ఈ వేళ. గెలుపు శ‌క్తిని పెంపొందించుకునే దిశ‌గా ప్ర‌యాణించాల‌ని జ‌గ‌న్ చెబుతూ, సంక్షేమ ప‌థ‌కాలు అందుకున్న వారిని క‌లిసి రండి అని దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రెండూ కూడా చాలా కీల‌కం అయిన‌వి అని చెబుతున్నారు జ‌గ‌న్. గెలుపు ఎంత కీల‌క‌మో త‌న‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కూడా అంతే ప్రాధాన్యం ను కూడుకున్న విష‌యం అని కూడా తేల్చేశారు జ‌గ‌న్.

ఆ విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల వెతుకులాట‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. యాభై శాతానికి పైగా ఎమ్మెల్యేల‌ను మార్చాలి అని భావిస్తున్నారు జ‌గ‌న్.. మార్పులు చేర్పులు ఎలా ఉన్నా కూడా ! జ‌గ‌న్ ముందు తెలుసుకోవాల్సిన‌వి చాలా అంటే చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చెబుతున్న ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకోవ‌డ‌మే అని, జీవన ప్ర‌మాణాల మెరుగుద‌లే ప్ర‌ధాన ధ్యేయంగా ఆ స్ఫూర్తిని అమలు చేయ‌డం ఇప్ప‌టి ప్ర‌భుత్వ బాధ్య‌త అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అంటే జీవించే హ‌క్కును కాపాడ‌డం అని కూడా అంటున్నారు.

ఇవ‌న్నీ బాగున్నాయి కానీ ఏడాదికి 22 శాతం మంది ప్ర‌జ‌ల‌కు సంబంధించి యాభై ఐదు వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి, మిగిలిన వ‌ర్గాల‌ను ఎలా విస్మ‌రిస్తారు? ఇంకా చెప్పాలంటే రెండు ల‌క్ష‌ల యాభై వేల కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ లో వీరు చూపిస్తున్న ఆదాయం ఎంత ? వ్యయం ఎంత ? గ‌ట్టిగా లెక్క‌లు వేస్తే యాభై నుంచి అర‌వై వేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం రూపంలో ప్ర‌భుత్వానికి వ‌స్తుంటే మిగిలిన డ‌బ్బు అంతా ఎక్క‌డి నుంచి తెస్తున్నార‌ని? ఇవి అలా ఉంచితే.. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అస‌లు ప్రాధాన్య‌మే లేదు. అభివృద్ధి కూడా రాజ్యాంగ హ‌క్కే ! ఎవరు ఎవ‌రిని కాదంటారు ? ధ‌ర్మాన తెలివిగా చెబుతుంటారు కానీ అవ‌న్నీ ఆలోచిస్తే ఇంకొన్ని ఫ‌లాలు లేదా ఫ‌లితాల లెక్క అందుతుంది.

రోడ్డు వేస్తే జ‌నం ఓట్లేయ్య‌రా అంటే డ‌బ్బులు పంచితేనే ఓట్లేస్తారా? అంటే ఓ ప్రాంతానికి అభివృద్ధి క‌న్నా సంక్షేమం ముఖ్యం అని భావిస్తే అందులో ఎంత‌మంది అర్హుల‌కు వాటిని చేరుస్తున్నార‌ని చెప్ప‌గ‌ల‌రు ? ఎలా చూసుకున్నా తెలంగాణ ప్రాంతం ఆంధ్రా క‌న్నాఎంతో బెట‌ర్. కొన్ని త‌ప్పిదాలు అక్క‌డ కూడా ఉన్నాయి కానీ 55 వేల కోట్ల పంప‌కాలు అన్న‌వి ఏడాదికి మాత్రం చేయ‌డం లేదు. నేను అప్పులు చేస్తాను అని నేరుగా చెప్పే ధైర్యం ఒక్క జ‌గ‌న్ కు త‌ప్ప వేరెవ్వ‌రికీ లేద‌ని టీడీపీ అందుకే విమ‌ర్శ‌లు చేస్తోంది. ఆ విధంగా ఇప్ప‌టిదాకా చేసిన అప్పుల గ‌తి అభివృద్ధిని ఏ మాత్రం ప్ర‌భావితం చేయ‌కుండా ఉండ‌డం నిజంగానే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాత‌మే !

ఓ పౌరుడి ప్రాణానికి భ‌ద్ర‌త ర‌హ‌దారి భద్ర‌త ఇస్తున్నారా? ఓ పౌరుడి ప్రాణానికి భ‌ద్ర‌త మంచి ఆరోగ్యం ఇస్తున్నారా? అస‌లు వైద్యం అందించడం అన్న‌ది కూడా రాజ్యాంగ హక్కే ఏది ఎక్క‌డ‌? ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు నిధులే లేవు. శుద్ధ‌మ‌యిన నీరు అందించ‌డంలో కూడా జీవించే హ‌క్కు దాగి ఉంది.

కానీ ప‌ల్లెల్లో ర‌క్షిత మంచి నీటి ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ‌ను ఇప్ప‌టిదాకా ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. సిస‌లు రాజ్యాంగ స్ఫూర్తి అంటే.. అందరినీ స‌మానంగా చూడ‌డం.. అంతేకాని రాజ‌ధానుల పేరిట విద్వేషాగ్నులు రాజేయ‌డం కాదు. అది అస‌లు సిస‌లు రాజ్యాంగ స్ఫూర్తి కానే కాదు. ఇప్పుడు ధ‌ర్మాన మ‌రోసారి ఆలోచించాలి .. జ‌గ‌న్ కూడా ఆయ‌న‌తో పాటే ఆలోచించిన చాలు ఇక అంతా మేలు.