Begin typing your search above and press return to search.

వైసీపీ గాలి వీస్తోంది..జగనే సీఎం:ఉండవల్లి

By:  Tupaki Desk   |   18 Jun 2018 10:19 AM GMT
వైసీపీ గాలి వీస్తోంది..జగనే సీఎం:ఉండవల్లి
X
ఒక వేళ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా రాష్ట్రంలో గాలి వీస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.

తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రిక-లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో టీడీపీకి మళ్లీ 110 సీట్లు వస్తాయని.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తాడని చెప్పిన సర్వే పూర్తి అబద్ధమని.. ఆ సర్వేకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లిన జగన్ కు ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. దీన్ని బట్టి అతడి వైసీపీ విజయం ఖాయమని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చూస్తే జగన్ కు అనుకూలంగా ఉన్నాయని.. జగన్ వ్యవహారశైలి.. ప్రజల్లోకి వెళ్లిన తీరు చూస్తే ఖచ్చితంగా గెలుస్తాడనిపిస్తోందని ఉండవల్లి చెప్పారు. అయితే వైసీపీ కి మంచి టీం కావాలని.. ఆ టీం లేకపోవడం వల్లే ఎన్నికలను సరిగ్గా ఎదుర్కోవడం లేదని.. జగన్ ఈ వీక్ నెస్ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని ఉండవల్లి చెప్పారు. అయితే అదే సమయంలో చంద్రబాబును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో తన ప్రతాపం చూపిస్తాడని.. అతడు కూడా సీట్లు సాధించే సమర్ధుడని ఉండవల్లి చెప్పారు. ‘ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ను ఇప్పుడే అంచనా వేయలేం. ప్రస్తుతం పార్ట్ టైం పొలిటీషియన్ గానే పనిచేస్తున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తే అతడి సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు’ అని అన్నారు.

పదేళ్లుగా ఎంపీగా సేవలందించానని.. ఇక తనకు పదవి అక్కర్లేదని.. అలాంటి ఉద్యోగం కోరుకోవడం లేదని ఉండవల్లి అన్నారు. తాను రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా కూడా మారాలనుకోవడం లేదని ఆయన అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎండగట్టారు. ‘కేంద్రంపై తిరగబడాలని సీఎంకు ఎప్పుడో చెప్పాను. కానీ అది చేయకుండా చంద్రబాబు నటిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు కేంద్రానికి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుంటే మేము భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం. కాంగ్రెస్, బీజేపీ కలిసే విభజించాయి. నాలుగేళ్లు ఎన్టీఏలో కలిసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు విడిపోయామంటున్నారు. ఏ పార్టీపైనా నాకు శత్రుభావం లేదు. నిధుల గురించి జనసేన ఇచ్చిన రిపోర్టు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు’ అని ఉండవల్లి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు పూర్తి గందరగోళంలో ఉన్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు.. ‘ఏపీకి ప్యాకేజీ కావాలో.. ప్రత్యేక హోదా కావాలో తేల్చుకోలేని గందరగోళంలో ఉన్నారు. అందుకే పలుమార్లు ఇలా మాట మార్చారు. ఏదో ఒకదానిపై చంద్రబాబు స్థిరంగా ఉండాల్సింది. అధికారం కోసం పెట్టుబడులు పెట్టి.. తర్వాత లాభం తీసుకుంటున్నారు. ఈ విధానాన్నే మార్చే ప్రయత్నం చేయాలి. పథకాలకు ఆన్ లైన్ లో పాస్ వర్డ్ విధానం తీసుకురావాలి. దీంతో వేటికి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుస్తుంది’ అంటూ బాబు విధానాలను ఉండవల్లి ఎండగట్టారు.