Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌పై జ‌గ‌న్ యార్క‌ర్‌... టీడీపీ క్లీన్‌బౌల్డ్‌...!

By:  Tupaki Desk   |   11 Feb 2022 6:42 AM GMT
టాలీవుడ్‌పై జ‌గ‌న్ యార్క‌ర్‌... టీడీపీ క్లీన్‌బౌల్డ్‌...!
X
తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలు, ద‌ర్శ‌కుల‌తో సీఎం జ‌గ‌న్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి. ఇన్నాళ్లుగా.. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన‌.. టాలీవుడ్‌ను ఏపీవైపు చూసేలా ఆయ‌న చ‌ర్య‌లు తీసుకున్నారు. అది కూడా వారిని బ్ర‌తిమాలికాదు..! వారిని ఒప్పించి కాదు!! వారే ఒప్పుకొనేలా.. వారే దిగివ‌చ్చేలా జ‌గ‌న్ వ్యూహాత్మ కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యం.. టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.

మ‌నం ఐదేళ్లు అధిక‌కారంలో ఉన్నాం.. అదిచేశాం.. ఇది చేశాం.. అని చెప్పుకొన్నాం.. కానీ, టాలీవుడ్‌ను ఏపీవైపు చూసేలా చేయ‌లేక పోయాం! అని నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

సీఎం జగన్ సినీ ప‌రిశ్ర‌మ‌ డిమాండ్లను వింటూనే మ‌రోవైపు వారిని సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగమేంటి? అన్న ప్రశ్నను సంధించారు. అంతేకాదు... ఏపీలో మీ సినిమాలు ఆడుతున్నాయి... పైగా ఎక్కువ రెవెన్యూ వ‌స్తోంది కూడా ఇక్క‌డ నుంచే మ‌రిమీరు ఏపీకి ఏం చేస్తున్నారు? అని నిల‌దీసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే విశాఖలో ఎక్కువ షూటింగ్ లు జరగాల్సిందేన‌ని ఆయ‌న తేల్చి చెప్పేశారు. దీనికి టార్గెట్‌గా 20 శాతం షూటింగ్ లు ఏపీలో జరగాల‌ని నిర్దేశం చేసేశారు.

60 శాతం సినీ పరిశ్రమకు ఆదాయం తెచ్చిపెట్టే ఏపీని విస్మరిస్తారా ? అని చిరంజీవి నేతృత్వంలో వ‌చ్చిన ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి బృందానికి ప్ర‌శ్న‌లు సంధించారు. సినీ పరిశ్రమ విశాఖ రావాలని జగన్ ఆకాంక్షను టాలీవుడ్ పెద్దలు తీరుస్తారో లేదో తెలియదు కానీ, ఈ ప‌రిణామంతో టీడీపీని ఆయ‌న ఆత్మ‌ర క్ష‌ణ‌లో ప‌డేశార‌నేది వాస్త‌వం. ఇన్నాళళ్లుగా ఏపీకి ఎంతో చేశామ‌న‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబును ముఖ్యంగా కార్న‌ర్ చేశారు. ప‌క్క‌నే ఉన్న తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి ర‌ప్పించ‌లేక పోయార‌నే వాద‌న‌ను జ‌గ‌న్ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించేశారు.

దీనిని బ‌ట్టి.. టీడీపీ చేసిన త‌ప్పు.. ఇప్పుడు ప్ర‌జ‌లు బాగా అర్ధ‌మ‌వుతోంది. ఏపీ అభివృద్ధి అంటే.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవ‌డంతోపాటు.. కీల‌క‌మైన టాలీవుడ్‌ను కూడా ఏపీకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించార‌ని.. దీనిని బ్ర‌తిమాలో.. బామాలో.. కాకుండా.. హ‌క్కుగా సాధించార‌ని .. ఒక‌ర‌కంగా.. టాలీవుడ్‌ను విశాఖ వ‌చ్చేలా చేశార‌ని నెటిజ‌న్లు కొనియాడుతున్నారు. ఈ విష‌యంలో టీడీపీ ఏం చేసిందో చెప్పుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.