Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌భ‌కు నంద్యాల బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిందే!

By:  Tupaki Desk   |   3 Aug 2017 11:22 AM GMT
జ‌గ‌న్ స‌భ‌కు నంద్యాల బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిందే!
X
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల దృష్టి అంతా... క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లోని ఎస్పీజీ గ్రౌండ్ వైపే మ‌ళ్లింద‌ని చెప్పాలి. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను పుర‌స్క‌రించుకుని అక్క‌డ త‌న పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన శిల్పా మోహ‌న్ రెడ్డి విజ‌యాన్ని కాంక్షిస్తూ కాసేప‌ట్లో ఎస్పీజీ గ్రౌండ్స్‌లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ మొద‌లు కానుంది. ఇప్ప‌టికే హైద‌రాబాదు నుంచి బ‌య‌లుదేరిన వైఎస్ జ‌గ‌న్... ఇప్ప‌టికే నంద్యాల చేరుకున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోక ముందే ల‌క్ష‌లాది మంది జ‌నం ప‌ట్టే ఎస్పీజీ స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. నంద్యాల‌లోని దాదాపుగా అన్ని దారులు కూడా ఎస్పీజీ గ్రౌండ్ వైపున‌కే దారి తీస్తున్నాయి.

ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణంలో ఇసుక వేస్తే రాల‌నంత ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మండుటెండ‌ను కూడా లెక్క‌చేయ‌ని నంద్యాల జ‌నం... జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని వినేందుకు స‌భా ప్రాంగ‌ణానికి త‌ర‌లివ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. స‌భా ప్రాంగ‌ణానికి వ‌చ్చిన వైఎస్ అభిమానులు, శిల్పా అనుచ‌ర వ‌ర్గం, వైసీపీ శ్రేణులు... టీడీపీ ఫిరాయింపు రాజ‌కీయాల‌పై దుమ్మెత్తి పోస్తూ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపిస్తున్నారు. అస‌లు నంద్యాల ఉప ఎన్నిక‌లో పోటీ చేసే అర్హ‌త టీడీపీ నేత‌ల‌కు గానీ, ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి గానీ, పార్టీ పిరాయించిన భూమా కుటుంబానికి గానీ లేద‌ని తెగేసి చెబుతున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డ‌చిన ఎన్నిక‌లో తాము వైసీపీ వెంటే నిలిచామ‌ని, ఈ ద‌ఫా కూడా త‌మ వైఖ‌రిలో కించిత్ మార్పు కూడా లేద‌ని, ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన శిల్పా మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని కూడా వారు చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డి, ఉప ఎన్నిక‌లో దొడ్డి దారి గెలుపే ల‌క్ష్యంగా టీడీపీ స‌ర్కారు వినిపిస్తున్న అభివృద్ధి మంత్రానికి తాము లొంగిపోయే ప్ర‌సక్తే లేద‌ని కూడా కార్య‌క‌ర్త‌లు నిన‌దిస్తున్నారు. వెర‌సి ఈ ఎన్నిక‌లో కుట్ర‌లు, కుయుక్తుల‌కు పాల్ప‌డుతున్న టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని కూడా వారు తేల్చి చెబుతున్నారు. జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ఫ‌లితాలు నంద్యాల ఉప ఎన్నిక నుంచే మొద‌లు కానున్నాయ‌ని కూడా వారు బ‌ల్ల‌గుద్ది మరీ చెబుతున్నారు. వెర‌సి త‌మ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక న‌వ్యాంధ్రలో న‌యా రాజ‌కీయాల‌కు తెర తీయ‌నుంద‌ని కూడా వారు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... స‌భా ప్రాంగ‌ణానికి జ‌నం త‌ర‌లివ‌చ్చిన వైనాన్ని చూసిన వైసీపీ నేత‌ల్లోనే ఉరిమే ఉత్సాహం క‌నిపిస్తోంది.