Begin typing your search above and press return to search.

ప్రత్యేకం ఆందోళనల మీద ఆంక్షలు అనవసరమా?

By:  Tupaki Desk   |   22 Sep 2015 3:59 AM GMT
ప్రత్యేకం ఆందోళనల మీద ఆంక్షలు అనవసరమా?
X
అమ్మ పెట్టాపెట్టదు.. అడక్క తినానీయదన్నట్లుగా ఉంది ఏపీ సర్కారు తీరు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తనకున్న పరిమితుల నేపథ్యంలో ఆచితూచి మాత్రమే మాట్లాడే దుస్థితి. ఏపీ ప్రధాన ప్రతిపక్షం తనకు అలాంటి ఇబ్బందే లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రత్యేకహోదా మీద గళం విప్పటం తెలిసిందే. ఈ మధ్యన తిరుపతిలో సభను నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా విశాఖపట్నంలో మరో యువ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది.

ప్రత్యేకహోదా అంశంపై ఏపీ అధికారపక్షం ఏమీ చేయటం లేదని.. విపక్షమే పోరాడుతుందన్నట్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరో ఒకరు ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నించటం మంచిదే. కేంద్రం మీద ఒత్తిడిని మరింత పెంచేందుకు వరుస ఆందోళనలు.. ర్యాలీలు.. పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి.. తమ వాదనను అశేష జనావళికి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా విపక్ష నేత వైఎస్ జగన్ మహా చురుగ్గా ఉన్నారు. ఏదో విధంగా ప్రత్యేకహోదా కోసం తాను చాలా కష్టపడుతున్నానన్న విషయాన్న ఏపీ ప్రజల్లో రిజిష్టర్ చేయాలని భావిస్తున్నారు. జగన్ తన ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఏపీ సర్కారు.. జగన్ సభల్ని అడ్డుకోవటం కోసం నిషేధం వేటు వేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా కోసం తాము ఎక్కడ ఆందోళన నిర్వహించాలని భావిస్తే.. అక్కడ ఆంక్షలు విధించటం ఏపీ సర్కారుకు ఈ మధ్య ఒక అలవాటుగా మారిందని తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా.. విశాఖలో నిర్వహించనున్న సదస్సును అడ్డుకునేందుకు సోమవారం రాత్రి హడావుడిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. బహిరంగ సభలు.. ర్యాలీలు.. ధర్నాలు నిర్వహించటానికి వీల్లేదంటూ ఉత్తర్వులు విధించాల్సిన అవసరం ఏమిటని జగన్ బ్యాచ్ ప్రశ్నిస్తున్నారు.

విశాఖలో మంగళవారం వైఎస్ జగన్ యువభేరీని నిర్వహించనున్న సమయంలో.. కొద్ది గంటల ముందు ఇలాంటి ఉత్తర్వులు.. సభను అడ్డుకోవటానికే తప్పించి మరొకటి కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకహోదా అంశంపై సభలు.. సమావేశాలు నిర్వహించటం తప్పేం కాదు. కానీ.. ప్రభుత్వం ఇలాంటి అంశాల్లో కలగజేసుకోకుండా ఉండటం మంచిది. హోదా సాధనకు ఎవరేం చేసినా స్వాగతించాల్సింది పోయి.. హద్దులు నిర్ణయించటం అంతమంచిది కాదు. ఇలాంటి వైఖరి ఏపీ సర్కారుకు చెడ్డపేరు తీసుకొస్తుందే తప్పించి మరొకటి కాదు. ఆంక్షలతోఅధికారపక్షంపై మరింత ప్రతికూలత.. విపక్షంపై సానుకూలత వ్యక్తం కావటం ఖాయం. ఈ విషయాన్ని బాబు సర్కారు గుర్తిస్తుందో..? లేదో..?