Begin typing your search above and press return to search.

రూ.789 కోట్లతో జగనన్న విద్యాకానుక ..ఈ ఏడాది ప్రత్యేకత ఇదే

By:  Tupaki Desk   |   27 Aug 2021 8:30 AM GMT
రూ.789 కోట్లతో జగనన్న విద్యాకానుక ..ఈ ఏడాది ప్రత్యేకత ఇదే
X
ఏపీలోని విద్యావిధానంలో సమూల మార్పులకు నాంది పలికినట్లు రాష్ట్ర ప్రభుత్వం. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్య అందిస్తుంది. విద్యాసంవత్సరం విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న విద్యాకానుక” పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్‌ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 2021–22 విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక పథకం కింద అందించే స్టూడెంట్‌ కిట్లకోసం రూ.731.30 కోట్లు వ్యయం కావచ్చని ముందు అంచనా వేశారు. తర్వాత విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా మరో రూ.57.92 కోట్లు కేటాయించారు. ఈ విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక కిట్లకోసం మొత్తం రూ.789.22 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

గత ఏడాది 42.34 లక్షల మందికి ఈ కిట్లు అందించగా ఈ విద్యాసంవత్సరంలో 48 లక్షల మందికిపైగా విద్యార్థులకు అందించబోతున్నారు. ఈసారి అదనంగా విద్యార్థులకు డిక్షనరీలను కూడా ఇస్తుంది. ఈనెల 16వ తేదీనుంచి పాఠశాలలు ప్రారంభమైన రోజునే సీఎం వై ఎస్ రెండో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఆ రోజునుంచే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. గత సంవత్సరం జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో అదనంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్‌ డిక్షనరీలను (బొమ్మల నిఘంటువును) అందిస్తున్నారు.

సీబీఎస్ఈ సిలబస్ తో ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్లంలో విద్యాబోధన, జగనన్న విద్యాకానుక ద్వారా కిట్ల పంపిణీ కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని స్కూళ్లలో 100 శాతానికి పైగా కూడా ఎన్ రోల్ మెంట్ పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలుగా ఉంటే, ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా పెరిగి 43 లక్షలకు చేరింది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయడమే గాక విద్యార్థుల కోరిక మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందిస్తోంది ప్రభుత్వం.