Begin typing your search above and press return to search.

జగన్నాథ ఆలయం భవిష్యత్తు మోడీ చేతుల్లో..

By:  Tupaki Desk   |   17 May 2016 10:34 AM GMT
జగన్నాథ ఆలయం భవిష్యత్తు మోడీ చేతుల్లో..
X
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయమైన ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదముందట. తక్షణమే దాన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉందట. ఈ మేరకు పూరీ జగన్నాథాలయం ప‌రిస్థితిపై అధ్యయనం చేసిన ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతి హిందువు జీవిత కాలంలో ఒక్కసారైనా పూరీ జగన్నాథాలయాన్ని దర్శించుకోవాలన్న నమ్మకం హిందువుల్లో ఉంది.. అంతటి ప్రాధాన్యమున్న ఆలయం కూలిపోబోతుందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం శిఖరంపై నుంచి గతంలోనూ పెద్దపెద్ద రాళ్లు కింద పడ్డాయి. తాజాగా పురావస్తు అధికారులు దీని పరిస్థితిని కొద్ది రోజులుగా పరిశీలిస్తున్నారు. అయితే.. ఆలయ సేవాయత్ లు వీరిని, వీరి వాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో అధికారులు ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ కు లేఖ కూడా రాశారు. తాజాగా వారు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

తక్షణం మరమ్మతులు చేపట్టకపోతే నష్టం త‌ప్ప‌ద‌ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్‌ కోర్‌ కమిటీ ఛైర్మన్ జీసీ మిత్రా చెబుతున్నారు. మిత్రా రీసెంటుగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు విషయం వివరించడంతో ఆయన ఇప్పటికే ప్ర‌ధాని మోదీకి పూరీ జగన్నాథాలయం ప‌రిస్థితిపై లేఖ రాశారు. దీంతో ఆల‌య అభివృద్ధికి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మోడీ నవీన్ కు సూచించారు.

అయితే.. కొద్దికాలంగా ఆలయ పరిస్థితులు పరిశీలిస్తున్న ఆర్కియాలజీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పనులు ఆలస్యమవుతున్నాయని కూడా నవీన్ మోడీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. మరోవైపు జగన్నాథాలయ అభివృద్ధి చర్య‌ల‌పై కేంద్రమంత్రులు దర్మేంద్ర ప్రధాన్‌ - మహేశ్‌ శర్మ నిన్న ఢిల్లీలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించారు. సాంకేతిక కార‌ణాల‌వ‌ల్లే ఆల‌య పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు ఆల‌స్యం అవుతున్నాయ‌ని ఈ సందర్భంగా దర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. ఆల‌య పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం నిధులను విడుదల చేస్తుంద‌ని ప్రధాన్ చెబుతున్నారు.

నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే జగన్నాథ ఆలయానికి మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టాలంటే ఆలయాన్ని కొద్దికాలం పాటు మూసేయాల్సి ఉంటుంది. దీన్ని సేవాయత్ లు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొద్ది నెలల్లో ఇక్కడ రథాయాత్ర కూడా జరగబోతోంది. ఏటా ఇక్కడ నిర్వహించే రథాయాత్ర దేశంలోనే అతి పెద్ద రథయాత్రగా ప్రసిద్ధి చెందింది. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రథయాత్రకు వస్తారు. కాబట్టి రథయాత్ర ముగిసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని సేవాయత్ లు వాదిస్తున్నారు. అయితే, ఈలోగా ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్కియాలజీ నిపుణులు హెచ్చరిస్తుండడంతోఏం జరగబోతుందా అన్న ఆసక్తి అంతటా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోడీ దీనిపై స్పందించి తక్షణ చర్యలకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.