Begin typing your search above and press return to search.

పూరీ జ‌గ‌న్నాథుడికి త‌ప్ప‌ని తిప్ప‌లు..ర‌థ‌యాత్ర‌కు ఆంక్ష‌ల‌తో అనుమ‌తి

By:  Tupaki Desk   |   10 May 2020 1:45 PM GMT
పూరీ జ‌గ‌న్నాథుడికి త‌ప్ప‌ని తిప్ప‌లు..ర‌థ‌యాత్ర‌కు ఆంక్ష‌ల‌తో అనుమ‌తి
X
దేశంలోనే అతి పెద్ద ర‌థ‌యాత్ర‌.. అశేష జ‌న‌వాహిని సుభ‌ద్ర‌ - బ‌ల‌రాముడితో క‌లిసి జ‌గ‌న్నాథ స్వామి ర‌థంపై ఊరేగుతూ భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చే ర‌మ‌ణీయ దృశ్యం ఒడిశా రాష్ట్రంలోని భువ‌నేశ్వ‌ర్ స‌మీపంలో పూరీలో ప్ర‌తి యేటా జ‌రుగుతుంది. ఆ యాత్ర‌కు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తుంటారు. శ‌తాబ్దాలుగా కొన‌సాగుతున్న ఆ యాత్ర‌కు తొలిసారి తీవ్ర ఆంక్ష‌లు వ‌చ్చి ప‌డ్డాయి. క‌రోనా వైర‌స్‌ తో ఆ జ‌గ‌న్నాథుడికి కూడా క‌ష్టాలు త‌ప్పేట్టు లేవు. వాస్త‌వంగా జూన్ 23వ తేదీన పూరీలో జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర ప్రారంభం కావాలి. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ ఉత్స‌వాల‌కు రెండు నెల‌ల ముందు నుంచే ఏర్పాట్లు సాగుతుంటాయి. అయితే ఈసారి కరోనా వ్యాప్తి.. లాక్‌ డౌన్ అమ‌లుతో ఆ ర‌థ‌యాత్ర జ‌రుగుతుందా.. లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ ఏర్ప‌డిన ఈ ర‌థ‌యాత్ర‌పై తాజాగా ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని తెలిసింది.

కేంద్ర ప్ర‌భుత్వం ర‌థ‌యాత్ర‌కు ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు స‌మాచారం. అయితే ర‌థ‌యాత్ర‌కు తీవ్ర ఆంక్ష‌లు విధించార‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఇప్పుడు మతపరమైన సమావేశాలు.. ఉత్స‌వాలు.. ఆలయాలకు భక్తుల ప్రవేశం వంటివి నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా ర‌థ‌యాత్ర కొన‌సాగుతుంది. కానీ భక్తులు పాల్గొనే అవ‌కాశం లేదు. షరతులతో కూడిన అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు జగన్నాథ ఆల‌య ప్ర‌తినిధులు చెబుతున్నారు.

ర‌థ‌యాత్ర‌కు ప్ర‌తియేటా కొత్త ర‌థం త‌యారుచేస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కొత్త ర‌థం రూపొందించ‌డానికి దాదాపు రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం ర‌థ‌యాత్ర నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి. అయితే ఆ ప‌నులు కేవ‌లం 72 మందితో చేయాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయ‌ని ఆల‌య నిర్వాహ‌కులు చెబుతున్నారు. ర‌థ‌యాత్ర ప్రాంతంలో పూజ‌లు నిషేధం. ర‌థాల నిర్మాణం.. ఆల‌యంలో పూజ‌ల స‌మ‌యంలో భ‌క్తులు భౌతిక దూరం పాటించ‌డంతో పాటు మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్పినిస‌రి అని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన‌ట్లు ఆల‌య ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఈ విధంగా కొద్దిమంది స‌మ‌క్షంలోనే ఈసారి జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర కొన‌సాగే అవ‌కాశం ఉంది. అయితే అధికారిక వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.