Begin typing your search above and press return to search.

అమరావతి భూముల పై జగన్ కీలక నిర్ణయం ..రైతులు ఒప్పుకుంటారా ?

By:  Tupaki Desk   |   2 Jan 2020 5:52 AM GMT
అమరావతి భూముల పై జగన్ కీలక నిర్ణయం ..రైతులు ఒప్పుకుంటారా ?
X
ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి పరిధిలోని గ్రామాల భూముల విషయం లో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారా ? అంటే దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సుమారు 34 వేల ఎకరాలు రైతుల నుండి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని చోట్ల భూములను ఉపయోగించుకున్నారు. చాలావరకు భూమి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆలా ఖాళీగా ఉండే భూమిని స్పెషల్ అగ్రి జోన్ కు ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

అమరావతి ప్రాంతం లో ఆందోళన చేస్తున్న రైతులు రాజధాని తరలింపు ప్రతి పాదనను వ్యతరేకిస్తు న్నారు. రాజధాని కొనసాగింపు మినహా ఏ ప్రతిపాదన వారు అంగీకరించటం లేదు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో వివరించి..వారి ఆందోళనలకు ముగింపు పలకాలని భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం వద్ద కొత్త ప్రతిపాదన సిద్దంగా ఉంది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించే అంశం మీద కసరత్తు జరుగుతోందని సమాచారం.

ఈ ప్రతిపాదనపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా.. ల్యాండ్ పూలింగ్ భూముల సహా ప్రభుత్వ భూములనూ ఈ ప్రత్యేక వ్యవసాయ జోన్ పరిధి లోకి తెచ్చే యోచన చేస్తున్నారు. రాష్ట్రం లోని ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పురోగతిని పరిశీలించిన అనంతరం నివేదిక రూపకల్పన చేసారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని ప్రాంతం తమ ప్రాంతంలో ఉండాలని మాత్రమే నినదిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా అనే సందేహం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అమరావతి నుండి రాజధాని తరలిస్తే.. తమ భూములకు విలువ ఉండదని..తాము నష్టపోతామనే భావన వారిలో ఉందని..దీని ద్వారా వారి ఆందోళనకు పరిష్కారం లబిస్తుందని ప్రభుత్వంలోని కొందరు నేతలు చెబుతున్నారు.

అసలు గత ప్రభుత్వం రాజధానికి కోసం భూములు అడిగినప్పుడు చాలామంది ఇవ్వటానికి రైతులు ఇష్ట పడలేదు. అయితే ప్రభుత్వం ఒత్తిళ్ళు పెట్టి, బెదిరించి, పంటలను తగలబెట్టి ఇలా రకరకాలుగా రైతులనుండి భూమిని తీసుకుంది. అయితే ఇపుడు ప్రభుత్వం వాపసు ఇచ్చినా తాము భూములను తీసుకోమంటూ కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడే అసలు ఆందోళన చేస్తున్నవారంత నిజమైన రైతులేనా అని అనిపించకమానదు. ఎందుకంటే, నిజమైన రైతులైతే ప్రభుత్వం భూములను తిరిగి ఇచ్చేస్తానంటే వద్దనే అవకాశాలు దాదాపు గా ఉండవు. కానీ , అమరావతి లో మాత్రం మాకు భూములు వద్దు అంటూ ఆందోళనలు చేస్తున్నారు. దీనితో ఏపీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.