Begin typing your search above and press return to search.

జగన్ ఆకర్ష్ వ్యూహం తో బాబు ఉక్కిరి బిక్కిరి

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:19 AM GMT
జగన్ ఆకర్ష్ వ్యూహం తో బాబు ఉక్కిరి బిక్కిరి
X
అధికారం లో ఉన్నప్పుడు ఉండే వెసులుబాటు వేరుగా ఉంటుంది. చేతిలో పవర్ ఉన్నప్పుడు చెలరేగి పోవటం లాంటివి చేయకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. రాజకీయ ప్రత్యర్థి ని తన వ్యూహం తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనం టీడీపీ అధినేత చంద్రబాబు కు ముచ్చమటలు పట్టేలా చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టారు.

వచ్చినోళ్లకు వచ్చినళ్లు గా పార్టీ కండువా లో కప్పేసి చేర్చుకోవటం ద్వారా ప్రత్యర్థి ని దెబ్బ తీయాలన్న ఆలోచన లో జగన్ లేరు. తాను నమ్మిన సిద్దాంతాలు.. వల్లె వేసిన విలువలకు ఏ మాత్రం అడ్డు రాని నేతల్ని మాత్రమే పార్టీలోకి ఎంట్రీ కల్పిస్తున్న జగన్ తీరు టీడీపీ అధి నాయకత్వానికి షాకుల మీద షాకులు తగిలేలా చేస్తోంది. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. పదవుల్లో ఉన్న వారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారే కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరటం లేదు.

ఎన్నికల్లో ఓటమి చెందిన వారు.. ఎలాంటి పదవులు లేకుండా.. ప్రజాబలం ఉన్న వారికి మాత్రం ఏపీ అధికారపక్ష పార్టీలో ఎంట్రీ లభిస్తోంది. ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. అదే సమయం లో ఎన్నికల్లో ఓడిన దేవినేని అవినాష్ మాత్రం పార్టీలో తాజాగా చేరారు.

గడిచిన కొద్దికాలం గా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. అర్థమయ్యేదేమంటే.. పదవుల్లో ఉన్న వారికి పార్టీలో చోటు కల్పించే విషయంలో జగన్ మొదట్నించి అనుసరిస్తున్న విధానాన్నే కంటిన్యూ చేస్తారని.. అలాంటి వారికి తమ పదవులకు రాజీనామా చేస్తే తప్పించి చోటు ఉండదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే.. పార్టీలో రాకుండానే తాము విడిచిన పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న వైనం ఇప్పుడు సంచలనం గా మారుతోంది.

పార్టీకి రాజీనామా చేసి.. వేరే పార్టీలో చేరకుండా తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న నేతల తీరు పై బాబు అండ్ కో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రానున్న రోజుల్లో మరి కొందరు నేతలు పార్టీని వీడటం ఖాయమని.. వారిలో పలువురు అధికార పార్టీలో చేరకుండా వంశీ మాదిరే కంట్లో నలుకలా మారతారంటున్నారు. ఈ వ్యూహం తెలుగు తమ్ముళ్లకు దిక్కుతోచని స్థితికి తీసుకెళుతుందంటున్నారు.