Begin typing your search above and press return to search.

వీహెచ్ బ్రేస్‌ లెట్ ను వేలం వేసిన జ‌గ్గారెడ్డి

By:  Tupaki Desk   |   16 Jun 2017 7:56 AM GMT
వీహెచ్ బ్రేస్‌ లెట్ ను వేలం వేసిన జ‌గ్గారెడ్డి
X
రాజకీయాలంటే పోటాపోటీగా విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం.. ఆరోప‌ణ‌లు సంధించుకోవటం.. దుమ్మెత్తి పోసుకోవ‌టం లాంటివే కాదు.. చాలానే ఉంటాయి. కొన్ని ఆస‌క్తిక‌ర ఉదంతాలు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. అలాంటి కోవ‌లోకే వ‌స్తుంది తాజా ఎపిసోడ్‌. జూన్ ఒక‌టిన సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన భారీ బహిరంగ స‌భ గుర్తుందా? ఆ స‌భ‌ను వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌గా తీసుకున్న కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి.. భారీగా ఖ‌ర్చు చేసిన స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించ‌టంపై కాంగ్రెస్ నేతలంతా ఫుల్ ఖుష్ అయ్యారు.

ఈ స‌భ‌కు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌ను ఇంత భారీగా నిర్వ‌హించ‌టం వెనుక కృషి అంతా జ‌గ్గారెడ్డిదేన‌ని రాహుల్ కు వివ‌రించారు రాజ్య‌స‌భ స‌భ్యుడు వీహెచ్ హ‌నుమంత‌రావు. దీనికి స్పందించిన రాహుల్‌.. మ‌రి మీరేం ఇచ్చారు? అని అడగ్గా.. నాద‌గ్గ‌ర ఏముంది? అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. దీనికి ప్ర‌తిగా ఆయ‌న చేతికి ఉన్న బంగారు బ్రేస్ లెట్‌ ను రాహుల్ చూపించారు. దీంతో.. అంద‌రూ న‌వ్వ‌టంతో ఆక్క‌డికి ఆ ఎపిసోడ్ ముగిసింది.

దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌టంతో.. త‌ర్వాతి రోజు స్పందించిన వీహెచ్‌.. త‌న బ్రేస్ లెట్ ను జ‌గ్గారెడ్డికి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి.. ఆయ‌న చేతికి స్వ‌యంగా తొడిగారు. తాజాగా ఆ బ్రేస్ లెట్‌ ను వేలంపాట‌కు పెట్టారు జ‌గ్గారెడ్డి. వేలంలో వ‌చ్చిన మొత్తాన్ని మిర్చి రైతుల కోసం వాడ‌తామ‌ని వెల్ల‌డించారు. అన్న‌ట్లుగానే ఈ రోజు (శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌ లో వేలంపాట‌ను నిర్వ‌హించారు.

ఈ వేలానికి ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు హాజ‌ర‌య్యారు. రూ.5ల‌క్ష‌ల‌తో మొద‌లైన వేలం.. రూ.20ల‌క్ష‌ల‌కు ముగిసింది. కృషి డెవ‌ల‌ప‌ర్స్ అనే భ‌వ‌న నిర్మాణ సంస్థ బ్రేస్ లెట్‌ ను సొంతం చేసుకుంది. వేలం త‌ర్వాత జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ మాట‌తో ఈ బ్రేస్ లెట్ ను రైతుల కోసం వాడాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింద‌ని చెప్పారు. వేలంలో వ‌చ్చిన మొత్తాన్ని ఖ‌మ్మం.. వ‌రంగ‌ల్ మిర్చి రైతుల‌కు అందించ‌నున్న‌ట్లు చెప్పారు. ఖ‌మ్మం మిర్చి రైతుల‌కు రూ.11 ల‌క్ష‌లు.. వ‌రంగ‌ల్ మిర్చి రైతుల‌కు రూ.9ల‌క్ష‌లు అందిస్తామ‌ని చెప్పారు. రాహుల్ స‌ర‌దాగా అన్న మాట ఇంత‌టి నాట‌కీయ ఎపిసోడ్‌ కు దారి తీసింద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/