Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డీ... ఈ నాన్చుడేంది సామీ!

By:  Tupaki Desk   |   9 May 2019 2:45 PM GMT
జ‌గ్గారెడ్డీ... ఈ నాన్చుడేంది సామీ!
X
తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి... ఈ పేరు పెద్ద‌గా తెలియ‌దు గానీ... జ‌గ్గారెడ్డి అంటే మాత్రం గుబురు గ‌డ్డంతో మంచి మాస్ లీడ‌ర్‌గా క‌నిపించే సంగారెడ్డి ఎమ్మెల్యే మ‌న క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్షం అవుతారు. ఇప్ప‌టికే ఎన్నో పార్టీలు మారిన జ‌గ్గారెడ్డి... అటు తిరిగి, ఇటు తిరిగి మ‌రోమారు కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజక‌వ‌ర్గం సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన జ‌గ్గారెడ్డి... టీఆర్ ఎస్ గాలిని త‌ట్టుకుని విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ - ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్ రావు - ఇత‌ర టీఆర్ ఎస్ నేత‌ల‌పై జ‌గ్గారెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

అయితే జ‌గ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల అంచ‌నాలు త‌ల‌కింద‌లై టీఆర్ఎస్ బంప‌ర్ విక్టరీతో అధికారంలోకి వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డికి బ్యాండేన‌ని అంతా అనుకున్నారు. ఈ విష‌యం జ‌గ్గారెడ్డికి కూడా అర్థ‌మైందో - ఏమో తెలియ‌దు గానీ... టీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా జ‌గ్గారెడ్డి టీఆర్ ఎస్ లో చేరిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న కూడా వినిపించింది. ఈ వాద‌న నిజ‌మేన‌ని జ‌గ్గారెడ్డి కూడా పర‌క్షంగా చెప్పేశారు గానీ... ఆ మాటను గ‌ట్టిగా మాత్రం చెప్ప‌డం లేదు. తాజాగా గురువారం కూడా మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఈ నెల 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్ లో ఉంటానో లేక టీఆర్ ఎస్ భవన్ లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

మొత్తంగా పార్టీ మార‌డం ఖాయ‌మేన‌ని చెప్పేసిన జ‌గ్గారెడ్డి... ఆ మాట‌ను గ‌ట్టిగా ప‌ల‌క‌డం లేదెందుక‌న్న విష‌యం మాత్రం అర్థం కావ‌డం లేదు. ఇక త‌న‌దైన శైలి వ్య‌వ‌హారాన్ని మరోమారు బ‌య‌ట‌పెట్టుకున్న జ‌గ్గారెడ్డి... తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగమే వింటానని - మిగిలిన సగం తన సొంత నిర్ణయాలే ఉంటాయంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. స్వశక్తితో ఎదిగానని - పార్టీ బ్యానర్ పై ఆధారపడి గెలిచిన నేతను కాదని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ని మాట‌లు మాట్లాడినా జ‌గ్గారెడ్డి ఇలా ఎందుకు నాన్చుతున్నార‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.