Begin typing your search above and press return to search.

ఇదేం లెక్క జ‌గ్గారెడ్డి?: హ‌రీశ్ పై మ‌రో విమ‌ర్శ బాణం!

By:  Tupaki Desk   |   21 Feb 2019 10:45 AM GMT
ఇదేం లెక్క జ‌గ్గారెడ్డి?: హ‌రీశ్ పై మ‌రో విమ‌ర్శ బాణం!
X
బాధితుడ్ని ఓదారుస్తారు. అందుకు భిన్నంగా విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌టం.. విమ‌ర్శ బాణాల్ని వ‌ద‌ల‌టంలో లెక్క ఏమిటి? కేసీఆర్ అంటే చాలు విరుచుకుప‌డే జ‌గ్గారెడ్డి.. గ‌డిచిన కొద్ది రోజులుగా హ‌రీశ్ రావును టార్గెట్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌ల‌కు టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రూ కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌టం.. త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల విష‌యంలో హ‌రీశ్ మౌనంగా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ ప‌ట్ల పాజిటివ్ గా.. హ‌రీశ్ ప‌ట్ల కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ్గారెడ్డి లెక్క అర్థం కాక జుట్టుపీక్కునే ప‌రిస్థితి.

మొన్న‌టివ‌ర‌కూ కేసీఆర్ ప్ర‌స్తావ‌న తెచ్చినంత‌నే గ‌య్యిమ‌నే జ‌గ్గారెడ్డి.. ఇప్పుడు అందుకు భిన్నంగా తెలంగాణ ముఖ్య‌మంత్రిని ప్ర‌శంసిస్తున్నారు. ఆయ‌న్ను ఏ విష‌యంలోనూ త‌ప్పు ప‌ట్ట‌టం లేదు. అదే స‌మ‌యంలో హ‌రీశ్ మీద ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌టం.. ఆరోప‌ణ‌స్త్రాల్ని సంధించ‌టం చేస్తున్నారు.

జ‌గ్గారెడ్డి తీరు వెనుక అస‌లు క‌థ వేరేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ తో యుద్ధం చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. రానున్న మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కూ కేసీఆర్ దే తెలంగాణ అన్న విష‌యంపై జ‌గ్గారెడ్డి క్లారిటీ తెచ్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు ఆయ‌న‌కు వీర విధేయుడిగా మారితే రానున్న ప‌దేళ్ల‌లో రాజ్యం ఏలొచ్చ‌న్న ఆలోచ‌న‌లో జ‌గ్గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

కేసీఆర్ కంట్లో ప‌డేందుకు.. ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించేందుకు వీలుగా హ‌రీశ్ మీద గ‌ళం విప్పుతున్నార‌ని చెబుతున్నారు. గ‌డిచిన కొంత‌కాలంగా హ‌రీశ్ ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టటం.. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు చోటివ్వ‌క‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది. అంద‌రూ హ‌రీశ్ విష‌యంపై జాలిని ప్ర‌ద‌ర్శిస్తూ.. అయ్యో.. హ‌రీశ్ కు ఎంత ప‌ని జ‌రిగిందంటూ కేసీఆర్ తీరును లోగుట్టుగా త‌ప్పు ప‌డుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఓపెన్ గా కేసీఆర్ కు త‌న మ‌ద్ద‌తును ఇవ్వ‌టంతో పాటు.. హ‌రీశ్ త‌ప్పుల్ని ఎత్తి చూపేలా.. హ‌రీశ్ సుద్ద పూస కాదు సుమా అన్న భావ‌న క‌లిగేలా కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

తాజాగా ఆ త‌ర‌హాలోనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు జ‌గ్గారెడ్డి.మంజీర‌.. సింగూరు నీటి విష‌యంలో హ‌రీశ్ త‌ప్పు చేశార‌ని.. వాటిని ప్ర‌భుత్వం వెంట‌నే స‌రిదిద్దాలంటూ జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హ‌రీశ్ త‌ప్పు చేశారు కాబ‌ట్టే.. తాను విమ‌ర్శ చేసినా ఆయ‌న స్పందించ‌టం లేద‌న్నారు. జిల్లాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలా? వ‌ద్దా? అన్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇష్ట‌మ‌ని చెప్పిన జ‌గ్గారెడ్డి. . తాను సీఎంను క‌ల‌వ‌న‌ని చెప్పారు. తాను చెప్పాల‌నుకున్న విష‌యాల్ని మీడియాతోనే చెబుతాన‌న్న ఆయ‌న మాట‌లు చూస్తుంటే.. కేసీఆర్ మ‌న‌సు దోచుకునేలా..ఆయ‌న‌కు న‌చ్చినట్లు మాట్లాడ‌టంపై జ‌గ్గారెడ్డి మ‌స్తు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. జ‌గ్గారెడ్డి అనుకున్న‌ట్లు కేసీఆర్ మ‌న‌సు దోచుకుంటారా? లేదా? అన్న‌ది కాల‌మే డిసైడ్ చేయాలి.