Begin typing your search above and press return to search.

సంధి వేళ సారు ఫీలయ్యేలా మాటలేంది ఫైర్ బ్రాండ్?

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:07 PM IST
సంధి వేళ సారు ఫీలయ్యేలా మాటలేంది ఫైర్ బ్రాండ్?
X
కొంతమంది నాయకుల పేర్లు పలికినంతనే వారికి సంబంధించిన కొన్ని విషయాలు చప్పున గుర్తుకొస్తుంటాయి. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ప్రస్తావించినంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. కేసీఆర్ పేరు ప్రస్తావించినంతనే ఆయనపై ఎగిరెగిరి పడే తీరుతో ఉన్న ఆయన.. కొద్ది నెలల నుంచి సీఎంతో సంధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల తన నియోజకవర్గంలో నిర్వహించిన సభలోనూ.. ఆయన సీఎంకు సానుకూలంగా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. తాను ఎవరి ముందు తలవంచనని.. నియోజకవర్గ ప్రజల కోసం తాను సీఎం కేసీఆర్ ఎదుట తల వంచుతానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గులాబీ కారులో ఎక్కేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నవేళ.. గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యమంటున్నారు.

ఇలాంటివేళ.. పాత జగ్గారెడ్డిని గుర్తుకు తెస్తూ.. తాజాగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సారుకు సురుకు పుట్టేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. సీఎం చేసిన ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలు దురదృష్టకరమన్న జగ్గారెడ్డి.. వారికి తాను అండగా ఉంటానని చెప్పారు. కార్మికుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించాలన్న ఆయన.. మంత్రి అజయ్ కు అల్టిమేటం విధించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చించి పరిష్కరించాలని.. లేనిపక్షంలో పువ్వాడ అజయ్ ఇంటిని ముట్టడిస్తానని వ్యాఖ్యలు చేశారు.

ఒకవైపు సీఎంతో సంధి కోసం ప్రయత్నిస్తూ.. మరోవైపు ఆయన మంత్రి వర్గంలోని మంత్రి ఇంటిని ముట్టడిస్తానని వ్యాఖ్యలు చేసిన తీరు సారుకు కోపం రాదా? అన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మంత్రి అయినా.. సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి.. సార్.. మీ మైండ్ సెట్ మార్చుకోండని.. కార్మికుల సమ్మె ముగిసేలా నిర్ణయం తీసుకోండని చెప్పే దమ్ము.. ధైర్యం ఎక్కడుంది? అన్ని తెలిసిన జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంది?